అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు

28 Jun, 2022 17:15 IST|Sakshi
హిమబిందు, ప్రవళ్లిక

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. 

ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్‌ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. 

చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్‌మహీంద్రా కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్‌ మాస్టర్‌ రఘుపాత్రుని శ్రీకాంత్‌ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది)

మరిన్ని వార్తలు