‘క్లాప్‌.. కెమెరా.. యాక్షన్‌ తరహాలో పవన్‌ శ్రమదానం’

2 Oct, 2021 19:19 IST|Sakshi

బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ

సాక్షి, కాకినాడ: పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను ప్రజలు సమర్థించరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మట్లాడుతూ.. శ్రమదానం ఎలా చేయకూడదో పవన్‌ అలా చేశారని, క్లాప్‌.. కెమెరా.. యాక్షన్‌ తరహాలోనే పవన్‌ శ్రమదానం ఉందని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ సీజనల్‌ పొలిటీషియన్‌ అని అన్నారు. వర్ష కాలంలో ఎవరైనా రోడ్లు వేస్తారా? అని మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజల కోసం కాదు కెమెరాల కోసం పవన్‌ యాక్షన్‌ అన్నట్లు ఉందని మండిపడ్డారు. ప్రజాస్వాయ్య వ్యవస్థపై పవన్‌కు నమ్మకం లేదని.. గాంధీ జయంతి రోజు హింసను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

పవన్ కల్యాణ్ ఎంచుకున్న కార్యక్రమం ప్రజలు హర్షించేది కాదని, చంద్రబాబు పాలనలో వర్షాలు కురవలేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ ఆలోచించాలన్నారు. టీడీపీ పాలకులు వేసిన రోడ్లు ఇప్పుడు పడుతున్నవర్షాలకు ధ్వంసం అయ్యాయని తెలుసుకోవాలన్నారు. తనకున్న గ్లామర్‌ను ప్రజలకు ఉపయోగపడేలా చేయకుండా అశాంతిని సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. తాత్కాలికంగా ఒకసారి కనిపించి ప్రజలను రెచ్చ గొట్టి లబ్ధి పొందాలన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడని దుయ్యబట్టారు. వర్షాలు తగ్గిన వెంటనే రూ.5,600 కోట్లతో రోడ్లు మరమత్తులు చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు.
 

మరిన్ని వార్తలు