మరో 4.39 లక్షల మంది అర్హులకు నేటి నుంచి సాయం

7 Nov, 2020 04:05 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో జక్కంపూడి రాజా

అర్హత ఉండీ ఇప్పటివరకు పథకాలు అందనివారికి..

బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ

సాక్షి, అమరావతి: వివిధ పథకాల కింద అర్హత ఉండీ ఇప్పటివరకు సాయం అందని వారికి శనివారం నుంచి ఆయా పథకాల కింద సాయం అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్‌ కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వైఎస్సార్‌ చేయూత పథకాలకు అర్హులై ఉండీ లబ్ధి కలగని 4.39 లక్షల మందికి ఈనెలలో వాటిని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శనివారం (నేడు) కాపునేస్తం, 9న వాహనమిత్ర, 10న జగనన్న చేదోడు, 11న నేతన్న నేస్తం, 12న చేయూత పథకాల కింద 4.39 లక్షల మందికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారికి అండగా ఉండేందుకు గ్రామ వలంటీర్‌ వ్యవస్థ ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో 28,19,000 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. సీఎం జగన్‌ ప్రజాసేవ అనే తపస్సులో భాగమే ప్రజా సంకల్పయాత్ర అని పేర్కొన్నారు. జగన్‌లాగా ఇచ్చినమాట నిలుపుకొనే వ్యక్తులు అరుదన్నారు. కష్టపడ్డ నాయకుడు కనుకే కష్టాలు తెలిసి, కష్టపడ్డవారికి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా విపత్తులోనూ సంక్షేమ పథకాలు ఆగకుండా సాగుతున్నాయన్నారు. నాడు చంద్రబాబుది పథకాలు ప్రకటించి ఎగ్గొట్టాలనే లక్ష్యం ఉన్న ప్రభుత్వమని విమర్శించారు.  

మరిన్ని వార్తలు