అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

24 Feb, 2021 04:43 IST|Sakshi
గుంటూరు జిల్లా కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలపై ఎమ్మెల్యేలతో సమావేశమైన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీ రంగనాథరాజు

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

సాక్షి, అమరావతి: పంచాయతీ పోరులో ప్రజలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు జై కొట్టారని, పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం ఖాయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో సేవా గుణం, ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం ఉన్న వారినే అభ్యర్థులుగా పోటీకి నిలపాలని ఆయన సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్‌ ఎన్నికలపై చర్చించారు.

మంత్రి మాట్లాడుతూ.. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ గెలిచి తీరుతుందన్నారు. గుంటూరు జిల్లా నేతలు సమష్టిగా పని చేసి ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. సమీక్షలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, ముస్తఫా, విడదల రజిని, అన్నాబత్తుని శివకుమార్, మద్దాళి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు