కరోనా బాధితులతో చెవిరెడ్డి ‘క్యారమ్స్‌’

23 May, 2021 04:48 IST|Sakshi
కోవిడ్‌ సెంటర్‌లో కరోనా బాధితులతో కలసి క్యారమ్స్‌ ఆడుతున్న ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  

చంద్రగిరి (చిత్తూరు జిల్లా): కరోనా బాధితులకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే బాధితుల కోసం పడకలు ఏర్పాటు చేసి, కిట్లు అందించి.. తగిన సాయం చేసిన చెవిరెడ్డి తాజాగా వారితో కలిసి చెస్, క్యారమ్స్‌ ఆడారు. బాధితులతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను చెవిరెడ్డి సందర్శించారు. మధ్యాహ్నం వరకు బాధితులతోనే గడిపారు. వార్డులన్నీ పరిశీలించారు.

కోవిడ్‌ కిట్లతో పాటు ఆహారం, వైద్య సేవలు, పారిశుధ్యం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వాకబు చేశారు. అక్కడే చెస్, క్యారమ్స్‌ ఆడుతున్న కరోనా బాధితులతో కలసి చెవిరెడ్డి కూడా ఆడారు. అనంతరం వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్నందుకు అభినందించారు.   కరోనా గురించి భయపడవద్దని.. ధైర్యంగా ఉండాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా బాధితులను అన్ని విధాలుగా అండగా ఉంటోందని చెప్పారు. 

మరిన్ని వార్తలు