ఎమ్మెల్యే ఔదార్యం: బాధితులకు 34 వస్తువులతో కోవిడ్‌ కేర్‌ కిట్లు

19 May, 2021 08:41 IST|Sakshi

తిరుపతి: కరోనా బాధితులకు ఉపయుక్తమైన కోవిడ్‌ కేర్‌ కిట్లు, హోమ్‌ ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ పక్కాగా ఉండాలని అధికారులను ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తన సొంత నిధులతో కిట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. కరోనా వచ్చినప్పటి నుంచి నయమయ్యే వరకు ఉపయోగపడే ఈ సామాగ్రిని బాధితులకు అందించాలని సంకల్పించారు. మంగళవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో ఎమ్మెల్యే దీనిపై సమీక్షించారు. చంద్రగిరి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 250 కిట్లు అందించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 5 వేల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని తెలియజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం కోవిడ్‌ కేర్‌ కిట్‌లో 34 వస్తువులు ఉండేలా చూడాలన్నారు. వివిధ రకాల స్నాక్స్‌తో పాటు ఆహారం తీసుకునేందుకు ప్లేటు, గ్లాస్, స్పూన్, వాటర్‌ బాటిల్, సోపు, షాంపు, డెట్టాల్, పేస్ట్, బ్రష్‌.. కరోనా నుంచి త్వరగా బయటపడేందుకు అవసరమైన పసుపు, రాళ్ల ఉప్పు, మాస్క్, శానిటైజర్, మల్టీవిటమిన్‌ టాబ్లెట్లు తప్పక ఉండేలా చూడాలన్నారు. అలాగే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లలో నాసల్‌ డ్రాప్స్, కషాయం, మల్టీ విటమిన్‌ టాబ్లెట్, డెట్టాల్, మెడికల్‌ కిట్‌ తదితరాలు తప్పనిసరిగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. హోమ్‌ ఐసులేషన్‌లో ఉన్న పేషంట్లను నిరంతరంగా పర్యవేక్షించాలని వైద్యులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు.
చదవండి: 17,269 కుటుంబాలకు పునరావాసం

>
మరిన్ని వార్తలు