పల్లె.. పల్లెకు.. జగనన్న పచ్చతోరణం

18 Jul, 2021 04:24 IST|Sakshi
మహిళలకు మొక్కలను అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉచితంగా 10 లక్షల పూలు, పండ్ల చెట్ల పంపిణీ

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శ్రీకారం

తిరుపతి రూరల్‌: జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద 10 లక్షల పూలు, పండ్ల చెట్ల ఉచిత పంపిణీకి ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి నిమ్మ, దానిమ్మ, జామ, ఉసిరి, బత్తాయి, దబ్బ, సీతాఫలం, సపోటా వంటి పండ్ల చెట్లతో పాటు, మందారం, నందివర్ధనం, గన్నేరు, టెకోమో, పారిజాతాల్లో వారికి నచ్చిన నాలుగు మొక్కలను అందజేశారు. పలువురికి మొక్కలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ సంకల్పించినట్లుగా ప్రతి పల్లె, వీధి, ఇల్లు.. పూలు, పండ్ల చెట్లతో కళకళలాడాలన్నారు.

ఉచితంగా ఇస్తున్న ఈ పూలు, పండ్ల చెట్లను పెంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 20 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, రాష్ట్రంలో పచ్చదనాన్ని, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు పచ్చతోరణం కార్యక్రమంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలియజేశారు. నాటిన మొక్కల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు