కొండెక్కిన కోడి కూర.. వారంలోనే రూ.100 పెరిగింది

7 Jul, 2021 07:53 IST|Sakshi

సాక్షి,శ్రీకాకుళం: చికెన్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. కరోనా నేపథ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది చికెన్‌ తినేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగిపోయింది. వారం రోజుల వ్యవధిలో కిలోపై వంద రూపాయలకు పైగా పెరిగింది. ఈ పరిస్థితి చూసి చాలామంది చికెన్‌ కొనేందుకు భయపడుతున్నారు. ఈ నెల నాలుగో తేదీ ఆదివారం కిలో రూ.285 ఉండగా.. తాజాగా మంగళవారం మరో రూ. 15 పెరిగి రూ. 300 చేరింది.

నిత్యావసరాల సరుకుల ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ఉండగా.. చికెన్, గుడ్లు ధరలు కట్టడి చేసే అధికారం మాత్రం వీరి చేతుల్లో లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాప్యారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. 
డిమాండ్‌ బట్టి ధరల పెంపు 
మార్కెట్‌లో చికెన్‌కు డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో బ్రాయిలర్‌ అసోసియేషన్‌ ధర నిర్ణయిస్తోంది. గుడ్ల ధరలను నేషనల్‌ ఎగ్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. వీరంతా ప్రైవేటు వ్యక్తులు కావడంతో తమకునచ్చినప్పుడు ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల కాలంలో మాంసం ప్రియులు పెరగడంతో దాన్ని అదునుగా చేసుకొని ధరలు పెంచేస్తున్నారు. కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి డిమాండ్‌ పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

హోల్‌సేల్‌ వ్యాపారులకు బాగానే ఉన్నా రిటైల్‌ అమ్మకందారులు మాత్రం కస్టమర్లకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెంచడంతో కిలో కొనుగోలు చేసేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలో రోజుకి లక్ష కేజీల చికెన్‌ అవసరం ఉంటుంది. సుమారు ప్రస్తుతమున్న ధర ప్రకారం రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. జిల్లా వాసులకు రోజుకి ఎనిమిది లక్షల గుడ్లు అవసరం. అయితే జిల్లాలో సుమారు ఆరు లక్షల వరకు ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన వాటిని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు