సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు

6 Apr, 2021 13:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మంగళవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం దీన్ని పునరుద్ధరించారన్నారు.

వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సీఎం వైఎస్‌ జగన్‌ రద్దు చేశారని రమణ దీక్షితులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని కోరారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివేనని అన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదని, వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే దుష్ప్రచారం చేశారని టీడీపీ ఆరోపణలను ఖండించారు.

చదవండి: ఆ స్థాయి సోము వీర్రాజుకు ఉందా?: ఎమ్మెల్యే భూమన

మరిన్ని వార్తలు