ప్రభుత్వ బడుల్లో బాల శాస్త్రవేత్తలు

30 Aug, 2023 04:13 IST|Sakshi

30 వేల మంది విద్యార్థులకు టెక్నాలజీ అంశాల్లో శిక్షణ ఇచ్చిన విద్యాశాఖ

జిల్లాలో టాపర్స్‌గా నిలిచిన 100 మందితో గ్రాండ్‌ ఫినాలే

సరికొత్త ఆవిష్కరణలకు రూపమిచ్చిన ప్రభుత్వ విద్యార్థులు

విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహమిచ్చిన యునిసెఫ్‌

10 విజేత బృందాలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష నుంచి వరకు బహుమతులు

బెస్ట్‌ నమూనాలకు పేటెంట్, మార్కెటింగ్‌ అవకాశం 

సాక్షి, అమరావతి: సర్కారు బడుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా సకల సదుపాయాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చురుకైన విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రోత్సహించి.. సరికొత్త ఆవిష్కరణలు చేసేలా మార్గనిర్దేశం చేసింది.

ఫలితంగా సౌర విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్, రోడ్డు పాడవకుండా దమ్ము ఇనుప చక్రాలతో నడిచే ట్రాక్టర్, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకుండా హెచ్చరించే సెన్సార్, కారులో ఇరుక్కుపోయిన పిల్లలను రక్షించే యంత్రం, రూ.1,200కే బట్టలు ఉతికే వాíషింగ్‌  మెషిన్‌ వంటి అనేక పరికరాలకు విద్యార్థులే ప్రాణం పోశారు.

రాష్ట్ర ప్రభుత్వం, యునిసెఫ్‌ సంయుక్తంగా ‘ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌ 2022–23’ పేరిట నిర్వహించిన ప్రదర్శనలో ప్రతిభ చాటిన 27 బృందాలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు.

ప్రారంభమైన పోటీలు
మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలు సోమ­వా­రం విజయవాడలోని ఓ హోటల్లో ప్రారంభమ­య్యాయి. 9, 10వ తరగతి విద్యార్థులు రూపొందించిన యంత్ర పరికరాలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

ఇందులో 10 విజేత బృందాలకు నగదు బహుమ­తితో పాటు భవిష్యత్‌లో యంత్రాల తయారీ, పేటెంట్‌ హక్కులు సైతం ఇవ్వనుండటం విశేషం. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.35 వేలు, ఐదో బహుమతిగా రూ.25 వేలు ప్రకటించారు. మరో 5 బృందాలకు రూ.10 వేల చొప్పున అందజేయనున్నారు. 

రైతు నేస్తం సోలార్‌ ట్రాక్టర్‌ 
రైతులు పొలం పనులు చేయాలంటే ట్రాక్టర్‌ వినియోగం తప్పనిసరి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ వంటి ఇంధన ఖర్చు పెరుగుతున్నాయి. ఈ ఖర్చును తగ్గించాలనుకున్నాను. పైగా దమ్ము చేసే ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావడంతో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఒక పరిష్కారం చూపాలని సోలార్‌తో నడిచే సపోర్టు ల్యాండింగ్‌ చక్రాల ట్రాక్టర్‌ను రూపొందించాం.

ట్రాక్టర్‌ పైన బిగించే సోలార్‌ ఫలకాల ద్వారా బ్యాటరీ చార్జి అవుతుంది. దానితో అవసరమైనంత పనిచేసుకోకోవచ్చు. మరోపక్క దమ్ము రిమ్ములు బిగించి రోడ్డుపైకి రాగానే వెనుకనున్న సపోర్టు ల్యాండింగ్‌ చక్రాల విచ్చుకుని ఇనుప చట్రాలను పైకి లేచేలా సహకరిస్తాయి. అప్పుడు రోడ్డు పాడవకుండా ట్రాక్టర్‌ ప్రయాణించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. బోయిన సౌమ్య, కలిదిండి జెడ్పీ హైస్కూల్, ఏలూరు జిల్లా

ఆరోగ్యాన్నిచ్చే వాషింగ్‌ మెషిన్‌
గ్రామాల్లో బట్టలు ఉతకడం కోసం చాల కష్టపడుతుంటారు. బట్టలు ఉతకడానికి మా అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి చవకైన వాషింగ్‌ మెషిన్‌ రూపొందించాలనుకున్నాను. మా బృందంలోని ముగ్గురం కలిసి పాత సైకిల్, ప్లాస్టిక్‌ డ్రమ్‌తో వాషింగ్‌ మెషిన్‌ తయారు చేశాం. ఇందులో బట్టలు, నీరు, డిటర్జెంట్‌ పౌడర్‌ వేసి సైకిల్‌ తొక్కితే కొద్దిసేపటికి మురికిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా దక్కుతుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,200 మాత్రమే ఖర్చయ్యింది. – గుడాల సంహిత సిరి, రాయకుదురు జెడ్పీ హైస్కూల్, పశ్చిమ గోదావరి జిల్లా

ఆక్సిజన్‌ తగ్గితే అలారమ్‌
కారులో ఉన్న వారికి ఆక్సిజన్‌ అందకపోతే వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసే సెన్సార్‌ను బోర్డును తయారు చేశాం. కారులో ఆక్సిజన్‌ తగ్గిపోతూ.. కార్బన్‌ డై ఆక్సైడ్‌ పెరుగుతుంటే వెంటనే అలారమ్‌ మోగుతుంది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై సాయం అందించేందుకు వీలుంటుంది. తక్కువ ఖర్చుతో ఏ కారులైనా బిగించుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించాం.
– సి.ప్రదీప్, వావిలి తోట జెడ్పీ హైస్కూల్, చిత్తూరు జిల్లా

మరిన్ని వార్తలు