వాగు మధ్యలో ప్రసవం.. 

21 Sep, 2020 04:38 IST|Sakshi
వాగు బయట ఆగిన 108 వాహనం

ఆ ఊరికెళ్లాలంటే వాగు దాటాల్సిందే..

కేవీబీపురం: ఆ గ్రామం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో వాగు దాటాల్సిందే. వర్షాలు వస్తే సుమారు 20 అడుగుల వరకు వాగు పారుతుంది. కొద్దిరోజుల వరకు బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోతాయి. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామం పరిస్థితి ఇది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన సునీత (25) అనే గిరిజన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది.

మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్‌ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థానికులు ఆటోలో కొబ్బరి మట్టల సహాయంతో గర్భిణిని గ్రామం నుంచి తీసుకొచ్చి వాగు దాటించే ప్రయత్నం చేశారు. పురిటినొప్పులు అధికమవ్వడంతో వాగు మధ్యలోనే గర్భిణికి కాన్పు చేశారు. ఆపై 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు