పాపం.. పసిహృదయాలు!

1 Sep, 2021 09:33 IST|Sakshi
తల్లి మృతదేహం వద్ద దిక్కుతోచని స్థితిలో ఇద్దరు బిడ్డలు, (ఇన్‌సెట్‌) సుగుణమ్మ(ఫైల్‌)

విధి ఆడిన వింతనాటకంలో.. తల్లిదండ్రులు దూరమై ఇద్దరు పిల్లలు వీధినపడిన ఘటన కేవీబీపురం మండలం, తిమ్మసముద్రం గ్రామంలో మంగళవారం కలచివేసింది. గత ఏడాది కరోనా మహమ్మారికి తండ్రి బలవ్వగా, ఇప్పు డు గుండె పోటుతో తల్లి దూరమవ్వడం ఆ చిన్నారులకు తీరని వేదనను మిగిల్చింది. నా అన్న వాళ్లు లేక.. తమ కాళ్లపై తాము నిలబడలేక తల్లడిల్లితున్న ఆ పసిహృదయాలను చూసి పలువురు కంటతడి పెట్టడం కనిపించింది.  

సాక్షి,చిత్తూరు: మండలంలోని తిమ్మసముద్రం గ్రా మానికి చెందిన ప్రతాప్‌రెడ్డి(48), సుగుణ(44) భా ర్యభర్తలు. వీరికి కుశి్మతా(17), నితీష్‌ సంతానం. మూడేళ్ల కిందట వరకు కిడ్నీ వ్యాధితో ప్రతాప్‌రెడ్డి వారంవారం డయాలసిస్‌ చేయించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్‌తో వైద్య ఖర్చులు పోను అంతోఇంతో కూడబెట్టి పిల్లల చదువుకు ఉపయోగించేవాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న వేళ గత ఏడాది కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. కుటుంబ పెద్దను పొట్టబెట్టుకుంది. అప్పటి వరకు లోకం తెలియని ఆ ఇల్లాలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

అందుబాటులో ఉన్న కూలిపనులకు వెళ్లి బిడ్డలకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని నిశ్చయించుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని పిల్లలకు తండ్రి లేనిలోటు లేకుండా చదివించింది. ఇలాంటి తరుణంలో మంగళవారం సుగుణకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంటివద్దే ప్రాణాలు వదిలింది. పెద్దగా బంధువులు కూడా లేకపోవడంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు. అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక ఆ పసిహృదయాలు తల్లడిల్లిపోయాయి. తల్లి మృతదేహం వద్దే దిగాలుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో స్థానికులు చేయిచేయి కలిపి వారికి అంతిమయాత్రను కొనసాగించారు. ఇద్దరు పిల్లల చేత తల్లికి తలకొరివి పెట్టించారు. వీధినపడిన పిల్లలను ప్రభుత్వం అక్కున చేర్చుకుని చదివించాలని స్థానికులు కోరుతున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు