ఆటలను మింగేసిన కరోనా..

6 Aug, 2020 09:14 IST|Sakshi

కరోనా నేపథ్యంలో ఆరుబయట ఆటలకు స్వస్తి

ఐదు మాసాలుగా మూతపడిన విద్యాసంస్థలు 

స్నేహితులతో ఆటలకు దూరమైన చిన్నారులు 

ఇళ్లల్లో ఇండోర్‌ ఆటలకే పరిమితం

శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్న బాల్యం

టీవీలో నిస్తేజంగా కార్టూన్స్‌ చూసేప్పుడల్లా.. స్కూల్‌లో స్నేహితులతో సరదా కబుర్లు చెబుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఆనందించిన రోజులే గుర్తుకొస్తాయి.. క్లాసులో మాస్టారు ఏ ప్రశ్న అడిగినా నేను చెబుతానంటూ ఠక్కున లేచి నిల్చుని, సమాధానం చెప్పి, ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయి ఎన్ని దినాలయిందో.. ఇంట్లో క్యారమ్‌ కాయిన్స్‌ సర్దేటప్పుడల్లా మా స్కూల్‌ గ్రౌండ్‌ గుర్తుకురావాల్సిందే.. గ్రౌండ్‌ అంతా కలియతిరుగుతూ, పరుగెత్తుతూ పడిలేస్తూ, అలసిసొలసేలా ఆటలు ఆడి ఎన్ని రోజులయిందో.. మళ్లీ ఆ ఆనందక్షణాలు ఎప్పుడొస్తాయో. ఇంట్లో అమ్మానాన్నలు టీవీ చూస్తూ అక్కడ అన్ని మరణాలంట.. ఇక్కడ ఇన్ని కేసులంట అని మాట్లాడుకుంటుంటే భయంతో ఆ మాటలు వినలేక ఇంటి కిటికీలోనుంచి రోడ్డుపైన తాండవించే ఆ నిశ్శబ్ద వాతావరణం చూస్తుంటే అసలు ఆ పాత రోజులు మళ్లీ వస్తాయో రావో.. అనే దిగులు. కరోనా విజృంభణ నేపథ్యంలో స్కూల్‌కు, ఆటపాటలకు దూరమైన ఒక చిన్నారి ఆవేదన ఇది..

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): ఉదయమే తుళ్లిపడి లేవడం, గబగబ కాలకృత్యాలు తీర్చుకోవడం.. రెడీ అయి స్కూల్‌కు వెళ్లడం.. అక్కడ పాఠాలు అనంతరం తోటి విద్యార్థులతో సరదా సరదా కబుర్లు.. అనంతరం స్కూల్‌ గ్రౌండ్‌లో ఆటపాటలతో సందడి.. సాయంత్రం ఇంటికి రాగానే హోం వర్క్‌ చేసుకోవడం.. మళ్లీ రీఫ్రెష్‌ అయి.. ఇళ్ల దగ్గర స్నేహితులతో కలిసి కాసేపు ఒళ్లు అలిసిపోయేలాగా ఆడిరావడం. వచ్చాక కాసేపు టీవీ చూడ్డం, పుస్తకాలు చదవడం, భోజనం అయిపోయాక కునుకేయడం.. ఇదీ లాక్‌డౌన్‌ ముందు చిన్నారుల షెడ్యూల్‌.  కానీ కరోనా చిన్నారుల సరదా ఆటలను మింగేసింది. ఈ మహమ్మారి వల్ల  చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతూ క్రీడామైదానాలకు, ఆటపాటలకు పూర్తిగా దూరమై శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 

ఇండోర్‌ ఆటలతో బోర్‌.. 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులు బయటకు వెళ్లలేక, ఇంట్లో ఆడే ఇండోర్‌ గేమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. క్యారమ్స్, చెస్, లూడో, పజిల్స్‌ వంటి వాటిని ఆడుతున్నా, ఇవి మైదానాల్లో ఆడేటప్పుడు ఇచ్చే హుషారును, శారీరక శ్రమను ఇవ్వలేకపోతున్నాయి. దీంతో చిన్నారులు శారీరక, మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. గడిచిన ఐదు మాసాలుగా ఇదేరీతిలో కొనసాగుతున్న వారి జీవన శైలి వారికే విసుగు పుట్టిస్తుందని పలువురు చిన్నారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

విద్యాసంస్థలకు దూరం.. 
రాష్ట్రంలో చిన్నారులు ఐదు మాసాలుగా విద్యాసంస్థలకు దూరంగా ఉంటున్నారు. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. అందులో భాగంగా మార్చి రెండో వారంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం వారం రోజుల పాటు తాత్కాలిక సెలవులను ప్రకటించింది. ఆ తరువాత మార్చి 24 నుంచి ఆ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆ తరువాత కరోనా తీవ్రత దృష్ట్యా అంచెలంచెలుగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తుండటంతో అవి అమలవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మాసాంతం వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటంతో మరో నెల పాటు చిన్నారులు తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావటం తప్పనిసరిగా మారింది. దాంతో చిన్నారులు మరో నెల పూర్తిగా ఆటస్థలాలకు దూరంగా ఉండాల్సిందే. 

శారీరక శ్రమలేని వైనం.. 
చిన్నారులు రోజూ కొద్దిసేపు ఆడుతూ పాడుతూ సరదాగా పరుగులు తీస్తూ, శారీరక శ్రమతోపాటు, ఆరోగ్యం కూడా పొందుతుంటారు. కానీ కరోనా పుణ్యమా చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతూ నాలుగు గోడల మధ్యలోనే గడుపుతున్నారు.  క్రీడలు లేదా ఏదైనా శారీరక శ్రమ ఉన్నప్పుడే మానసికంగా, శారీరకంగా కూడా చిన్నారులు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారని, వారు ఎటూ కదలకుండా ఉంటే వ్యాధి నిరోధక శక్తికూడా సన్నగిల్లుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ దూరమైంది  
కరోనా నేపధ్యంలో పిల్లలకు ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ దూరమైంది. విద్యాసంస్థల్లో ఆటస్థలాల్లో తమకిష్టమైన ఆటలాడుతూ కొంత శారీరక శ్రమ చేయటం వలన ఆరోగ్యాన్ని పొందేవారు. ఆట స్థలాలు లేని విద్యాసంస్థల్లోనూ చిన్నారులు కొద్దిగా యాక్టివ్‌గా ఉంటూ అటుఇటు పరుగులు తీయటం చేస్తుంటారు. అది కూడా శరీరానికి కొంత ఉపకరిస్తుంది. కరోనాతో ఏదీ లేకుండా పోయింది. అంతేకాకుండా  చిన్నారులు ఎటు కదలకుండా ఉండటం వలన కూడా వారిలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది.
– డాక్టర్‌ ప్రసాద్‌బాబు, ఇగ్నో సహాయ సంచాలకులు

ఆటలకు దూరమైతే ఆరోగ్యానికి దూరమైనట్లే.. 
పిల్లలు ఆటలకు దూరమైతే ఆరోగ్యానికి కూడా దూరమైనట్లే. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపధ్యంలో చిన్నారులు విద్యాసంస్థలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. కనుక మైదానాల్లో ఆటలు లేవు. దాంతో  పిల్లలకు వ్యాయామం లేకుండా పోయింది. ఇళ్లకే పరిమితం కావటం వలన కొంత ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. పిల్లలు సాధ్యమైనంత వరకూ కొంత సమయం వ్యాయమంలో నిమగ్నమయ్యే విధంగా తల్లిదండ్రులు చూడాలి. దాని వలన కొంతమేలు జరుగుతుంది.
– డాక్టర్‌ మాజేటి మాధవి, చిన్న పిల్లల వైద్యనిపుణురాలు 

మరిన్ని వార్తలు