ఎవరికీ చెప్పుకోలేక... దారితప్పుతున్న యువత

12 Jun, 2022 17:45 IST|Sakshi

యువత పెడదోవ పడుతోంది. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం ‘సెల్‌ ఫోన్‌’ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. మంచికోసం వినియోగించాల్సిన తమ మేధస్సును పెడదోవ పట్టిస్తోంది. తల్లిదండ్రులకు తలనొప్పులు తెస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు తప్పులు చేస్తుంటే వారిని వారించడం తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు సమస్యను ఎవ్వరితోనూ చెప్పుకోలేక ఇద్దరూ లోలోన మథనపడుతున్నారు. సున్నితమైన అంశాలు కావడంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది.   

ఏయూక్యాంపస్‌/ఎంవీపీ కాలనీ: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది బాలురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొద్దిరోజుల్లో వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఓ బాలుడు మిగిలిన వారి తల్లిదండ్రులకు మత్తు పదార్థాల సేవనం గురించి తెలియజేశాడు. దీంతో కక్ష గట్టిన ఐదుగురు బాలురు ఓ రోజు రాత్రి ఆ అబ్బాయిని నమ్మించి తీసుకువెళ్లి గంజాయి సేవించిన తర్వాత విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తుప్పల్లో పెట్టి పడేశారు. వీరంతా హైస్కూల్‌ స్థాయి విద్యార్థులే. మద్దిలపాలెం సమీపంలో సుమారు నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన పిల్లల విపరీత ప్రవర్తనకు ఓ నిదర్శనం.  

కొద్ది రోజుల క్రితం నగరంలోని డాబాగార్డెన్స్‌ సమీపంలో ఓ యువకుడిపై స్నేహితులే కత్తులు, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. గతంలో తలెత్తిన చిన్నచిన్న వివాదాలకే కక్ష గట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు బాలురే కావడం గమనార్హం. ఆధునిక సమాజంలో ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సెల్‌ఫోన్లు తదితర సామాజిక మాధ్యమాలు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడడం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివిఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఇటీవల ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులూ మైనర్లే కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన నొక్కి చెప్పింది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది.  

క్రమంగా బానిసలై.. 
సరదా కోసం స్నేహితుల ప్రోద్బలం, ప్రభావంతో ప్రారంభించిన చెడు అలవాట్లు పిల్లల మెడకు చుట్టుకుంటున్నాయి. రానురాను వీరు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు తక్కువ ధరకు లభించడంతో యువత దీన్ని అధికంగా అభ్యంతరకర పనులకు వినియోగిస్తున్నారు. ఇవి వారి లోచనలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. సరదా కాస్తా అలవాటుగా మారిపోవడం, దానిలో గంటల తరబడి సమయం గడపడం విద్యా ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యువత భవిష్యత్తును అంధకార బంధురంగా మార్చివేస్తోంది.  

చెడువైపే ఆకర్షణ 
ఉన్నత పాఠశాల విద్యకు వచ్చిన నాటి నుంచి పిల్లల్లో విపరీత ఆలోచనలు మొదలవుతున్నాయి. 6, 7 తరగతులకు వచ్చిన ప్రతీ చిన్నారి సెల్‌ఫోన్‌ వినియోగించడం సాధారణమైపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇచ్చే ఈ చిన్న పరికరం పెను సమస్యలకు కారణంగా మారుతోంది. యుక్తవయస్సులోకి అడుగిడే సమయంలో మంచి కంటే చెడు వీరిని సులభంగా ఆకర్షిస్తోంది. సెల్‌ఫోన్‌లో అసభ్యకర చిత్రాలు వీక్షించడం, ధూమపానం, మద్యం వంటివి వీరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడితే సులభంగా వీరు తప్పటడుగులు వేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇంటి వరకు వివాదాలు  
స్నేహితులతో వివాదాలు, అనైతిక చర్యలకు పాల్పడటం, మత్తుపదార్థాల సేవనం, ప్రేమ వ్యవహారాలు, విపరీత ధోరణులతో తరచూ వివాదాలకు కేంద్రంగా యువత మారిపోతున్నారు. ఆ వివాదాలు ఇంటిమీదకు రావడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతోంది. గౌరవంగా జీవనం సాగిస్తున్న జీవితాలను అతలాకుతలం చేసే విధంగా యువత ప్రవర్తన ఉంటోంది. బయటకు పొక్కితే, పోలీసుల రికార్డుల్లో నమోదైతే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందనే భయంతో తల్లిదండ్రులు సమస్యను ఎవ్వరికీ చెప్పకుండా గుండెల్లో దాచుకుంటున్నారు. ఇది యువతకు అవకాశంగా మారిపోయి వారు మరింత బరితెగించి ప్రవర్తించే దిశగా ప్రోత్సహించినట్లుగా మారుతోంది. దీనికి పరిష్కారం చూపుతూ మానసిక నిపుణుల సహకారంతో యువతను చక్కదిద్దే కేంద్రాలు ఏర్పాటు కావడం ఎంతో అవసరం. 

చెడ్డవారితో స్నేహాలు, వ్యసనాలకు అలవాటు పడిన యువతకు తప్పు చేయడం ఓ అలవాటుగా మారిపోతోంది. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీ సరిపోకపోవడంతో ఇంట్లో డబ్బులు దొంగలించడం నుంచి తల్లిదండ్రుల ఏటీఎం కార్డులు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలు తెలుసుకుని నగదు బదిలీ చేసుకునే వరకు వెళ్తున్నారు. వీటిని తల్లిదండ్రులు గమనించకపోవడంతో కొనసాగించడం.. వారికి తెలిస్తే పశ్చాత్తాప భావన లేకుండా ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది. అబద్ధాలు ఆడటం, పొంతన లేని సమాధానాలు చెప్పడం, నిజాలను దాచడం చేస్తూ వివాదాల్లో, సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులు వీటిని తెలుసుకునే సమయానికి వీరు చేయిదాటిపోతుండటం జరుగుతోంది. ఒక్కో దశలో తల్లిదండ్రులను ఎదిరించడం, తాను ఇలానే ఉంటానని తెగించి మాట్లాడటం వరకు వస్తోంది. 

నైతిక విలువలు బోధించాలి 
పిల్లలకు మార్కులు కాదు.. బిహేవియరల్‌ క్వాలిటీస్‌ ప్రధానం. దీనిని తల్లిదండ్రులు గమనించి చిన్నారులను తీర్చిదిద్దాలి. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులను సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. శతక పద్యాలు, నీతి సూత్రాలు చిన్నారులకు బోధించే ప్రయత్నం జరగాలి. తద్వారా వారి భవిష్యత్‌ జీవనానికి బలమైన పునాదులు బాల్యంలోనే పడతాయి.   
– తాతా సందీప్‌ శర్మ, శతావధాని 

సమాజం పెను సవాల్‌ ఎదుర్కొంటోంది  
ఇంటర్నెట్‌ యుగంలో పిల్లలకు స్వేచ్ఛ పెరిగిపోయింది. ప్రస్తుతం సమాజాన్ని శాసిస్తున్న ఎలక్ట్రానిక్‌ గాడ్జాట్స్‌లో సెల్‌ ఫోన్‌ ముందు వరుసలో ఉంది. ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉన్న చాలా మంది తల్లిదండ్రులు వారి పనులకు ఆటంకం కలగకుండా పిల్లలకు సెల్‌ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీంతో రెండున్నరేళ్ల నుంచే సెల్‌ ఫోన్‌ ప్రభావం పిల్లలపై కనిపిస్తోంది. క్రమంగా పబ్‌జీ వంటి గేమ్‌లతో పాటు ఆన్‌లైన్‌ క్రైమ్స్, అడల్ట్‌ కంటెంట్స్‌ ఉన్న వీడియోల వైపు ఆకర్షితులవుతున్నారు. గంటల తరబడి ఫోన్‌కి బానిసలై.. వ్యసనాలకు లోనై నేర మార్గం వైపు అడుగులు వేస్తున్నారు.

మద్యం, మత్తుమందులు, సిగరెట్లను స్టేటస్‌ సింబల్‌గా, హీరోయిజంగా భావిస్తున్నారు. దీంతో సామాజిక బంధాలకు, చదువుకు క్రమంగా దూరమై.. కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. క్రియేటివ్‌ వర్క్స్, చిన్న చిన్న ఇంటి పనులను అలవాటు చేయాలి. ఇతరులతో స్నేహపూర్వకంగా మెలగడం, విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి.   
– డాక్టర్‌ భవానీ, క్లినికల్‌ సైకాలజిస్ట్‌   

మరిన్ని వార్తలు