మిర్చి సాగు.. లాభాలు బాగు 

23 Jul, 2022 23:16 IST|Sakshi
మడకశిర పరిధిలోని ఎల్లోటిలో సాగు చేసిన మిర్చి పంట

ఎకరాకు రూ.లక్ష     దాకా ఆదాయం

వైఎస్సార్‌ బీమా వర్తింపుతో పంట సాగుకు రైతుల ఆసక్తి 

ప్రోత్సహిస్తున్న ఉద్యానశాఖ అధికారులు

మడకశిరరూరల్‌: ఎండు మిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. మడకశిర నియోజకవర్గంలో అధిక శాతం మంది రైతులు ఎండు మిర్చి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఏడాది వేరుశనగ సాగుతో నష్టాలు మూటకట్టుకుంటున్న రైతులు ఎలాగైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మిర్చి సాగువైపు దృష్టిసారించారు. ప్రసుత్తం ఎండు మిరపకు మార్కెట్‌లో మంచి« ధర ఉండటంతో బోరుబావుల కింద ఎక్కువ మంది మిరప సాగు చేస్తున్నారు.  

910 ఎకరాల్లో సాగు... 
మడకశిర, అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల మండలాల్లో ఇప్పటికే 910 ఎకరాలకుపైగా సాగు చేసిన మిరప పంట ఆశాజనకంగా ఉంది. ఎక్కువ మంది రైతులు మిరప సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిరప పైరు ఒక్కోటి రూ.75 పైసాలు కాగా ఎకరా పంట సాగుకు మిరప పైరుకు రూ.12 వేలు ఖర్చు అవుతోంది.  

ఎకరాకు రూ.లక్ష ఆదాయం 
కృషాజలాలకు తోడు భారీ వర్షాలు కురవడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. బోరు బావుల్లోనూ నీటి మట్టం పెరగడంతో మిరప పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరా పంట సాగుకు మిరప పైరు, మందులు, ఎరువులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. మార్కెట్‌లో ప్రసుత్తం 10 కిలోల ఎండు మిరప రూ.2,500 వరకు ధర పలుకుతోంది. తెగుళ్లు సోకకపోతే ఎకరాకు రూ.లక్ష దాకా ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు. 

వైఎస్సార్‌ బీమా వర్తింపుతో... 
రాష్ట్ర ప్రభుత్వం మిరప పంటకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా వర్తింపజేయడంతో అధిక శాతం మంది రైతులు మిర్చి సాగుపై మరింతగా ఉత్సహం చూపుతున్నారు. వర్షాలకు పంట దెబ్బతింటే ఎకరా మిరప పంటకు రూ.60 వేల చొప్పున బీమా వర్తిస్తోంది. 

బీమా వర్తింపు హర్షణీయం 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మిరప పంటకి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా చెల్లించడం చాలా సంతోషంగా ఉంది. మిర్చి పంట సాగుతో ఆదాయం పొందుతున్నాం. అర్ధ ఎకరాకు పైగా మిరప పంట సాగు చేశా.  గతంలో ఏ ప్రభుత్వం మిరపకు బీమా మంజూరు చేయలేదు.                
– నాగరాజు, రైతు, ఎల్లోటి 

పదేళ్లుగా మిర్చి సాగు 
బోరు బావి కింద పదేళ్లుగా మిర్చి పంటను సాగు చేస్తున్నాను. సాగు చేసిన నెల తర్వాత మెదటి క్రాప్‌ మిపర కాయలను తొలగించుకోవచ్చు. ప్రసుత్తం మార్కెట్‌లో మిర్చి ధర బాగా ఉంది. మిరప పంట సాగు ద్వారా మంచి ఆదాయం పొందుతున్నాను.           
– ఆవులప్ప , రైతు, మడకశిర 

అవగాహన కల్పిస్తున్నాం 
మిర్చి పంటకు ప్రభుత్వం ఎకరాకు రూ. 60వేలు వైఎస్సార్‌ ఉచిత బీమా వర్తింపజేస్తోంది. బోరు బావుల్లో నీటి మట్టం పెరగడంతో గతంలో కంటే ఈ ఏడాది రైతులు మిరప పంటసాగుపై దృష్టి సారిస్తున్నారు. మిరప పంటకు తెగుళ్లు సోకకుండా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 
– చిన్న రెడ్డయ్య, ఉద్యానశాఖ అధికారి, మడకశిర   

మరిన్ని వార్తలు