చీనీ నర్సరీలతో అధిక లాభాలు

25 Jul, 2022 23:21 IST|Sakshi
లింగాలలో నాటడానికి సిద్ధంగా ఉన్న చీనీ మొక్కలు   

లింగాల: మండలంలో చీనీ నర్సరీలు విస్తారంగా సాగవుతున్నాయి. మండలంలోని లింగాల, పెద్దకుడాల, బోనాల, కర్ణపాపాయపల్లె, వెలిదండ్ల గ్రామాల్లోని రైతులు చీనీ నర్సరీలు విస్తారంగా సాగు చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి చీనీ నర్సరీలవల్ల లాభాలు గడిస్తున్నారు. ఏపీ, తెలంగాణా ప్రాంతాల నుంచి చీనీ మొక్కల కోసం విరివిగా వస్తున్నందున వాటికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో నర్సరీల సాగు కోసం మండల రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు.  

జంబోరా నారుకు డిమాండ్‌ :  చీనీ నర్సరీలు సాగు చేయాలంటే జంబోరా నారు అవసరం. ఈ నారును అన్నమయ్య జిల్లా రాజంపేటలోనే సాగు చేస్తారు. గత ఏడాది ఒక్కో జంబోరా మొక్క ఒక్క రూపాయి ఉండగా.. ప్రస్తుతం రూ.3లు పలుకుతోంది. గత ఏడాది భారీ వర్షాలవల్ల రాజంపేట ప్రాంతంలో జంబోరా విత్తనాలు మొలకెత్తకపోవడంతో అక్కడక్కడా ఉన్న జంబోరా నారుకు డిమాండ్‌ పెరిగిందని.. దీంతో ధరలు పెరిగాయని రైతులు అంటున్నారు. అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో లభించే జంబోరా విత్తనాలు తగినన్ని లభించకపోవడం కూడా జంబోరా నారు ధరలు పెరగడానికి కారణమంటున్నారు.  

ఏడాది పాటు వేచి ఉండాలి..  
జంబోరా నారు నాటినప్పటి నుంచి ఆరు మాసాలు జంబోరా మొక్కలు పెంచాలి. ఆ తర్వాత నాణ్యమైన చీనీ చెట్ల నుంచి కొమ్మలు వేరు చేసి వాటికి అంట్లు కట్టాలి. అంట్లు కట్టిన ఏడాదికి చీనీ మొక్కలు చేతికందుతాయి.  

కూలీలకు డిమాండ్‌ :  జంబోరా మొక్కలు నాటడానికి, వాటికి అంట్లు కట్టడానికి నైపుణ్యం గల కూలీలనే ఆశ్రయించాలి. విస్తారంగా చీనీ నర్సరీలు సాగు అవుతున్నందున కూలీలకు డిమాండ్‌ పెరిగింది. దీంతోపాటు కూలీ ధరలు కూడా బాగా పెరిగాయి.  

లాభాలు వస్తున్నాయి 
పెట్టుబడులు పెట్టినా చీనీ మొక్కలకు డిమాండ్‌ ఉన్నందున మంచి లాభాలు వస్తు న్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు చీనీ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే నర్సరీ రైతులకు కాస్తా ఊరట లభిస్తుంది.          
– కేశంరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నర్సరీ రైతు), లింగాల  

లింగాల చీనీ మొక్కలకు డిమాండ్‌ 
లింగాల మండలంలో సాగు చేసిన చీనీ మొక్కలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఇక్కడ జంబోరా, రంగపూర్‌ మొక్కలు నాణ్యమైనవిగా పేరుగాంచింది. దీంతో ఏపీ, తెలంగాణా రైతులు వీటిపైనే మక్కువ చూపుతున్నారు.  
– ముచ్చుమర్రి చంద్రశేఖరరెడ్డి (చీనీ నర్సరీ రైతు), లింగాల  

మరిన్ని వార్తలు