న్యూ ఇయర్‌ పార్టీకి అత్తారింటికి వెళ్లడమే శాపమైంది.. 

2 Jan, 2023 08:54 IST|Sakshi

బిక్కవోలు: న్యూ ఇయర్‌ వేడుకలో శృతి మించిన సరదా ఒకరి ప్రాణాన్ని బలిగొన్న ఘటన మండలంలోని కొమరిపాలెంలో ఆదివారం జరిగింది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన కొమారపు చిన్నబాబు(20) కొమరిపాలెం గ్రామానికి చెందిన వెంకటలక్షి్మని 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొమరిపాలెంలో నివాసం ఉంటున్నాడు. 

కాగా, నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని భార్యను, కుమార్తె వినితను పక్క వీధిలో ఉంటున్న అత్తవారింటికి పంపించాడు. అర్ధరాత్రి సమయంలో పక్కింటిలోనే ఉంటున్న వెంకటలక్ష్మి బంధువు ఖండవిల్లి నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో కేక్‌ క్రీమును ఒకరికొకరు పూసుకునే క్రమంలో నూకరాజు కుటుంబ సభ్యులు చిన్నబాబును హేళన చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగింది. చిన్నబాబు అత్తగారి ఇంటికి వచ్చిన తరువాత.. ఇదే విషయమై నూకరాజుకు వెంకటలక్ష్మి ఫోన్‌ చేసి అడిగింది. నీ భర్త రేపు ఉండడంటూ నూకరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

తెల్లవారుజాము మూడుగంటల ప్రాంతంలో నూకరాజు కూతురు శిరీష, ఆమె భర్త ధర్మ అలియాస్‌ సురేష్‌, అతని ఇద్దరు స్నేహితులు చిన్నబాబు అత్తవారింటి వద్దకు వచ్చి బయటకు రమ్మని కేకలు వేశారు. చిన్నబాబు బయటకు రావడంతో సురేష్‌ కత్తితో పలుచోట్ల పొడిచి చంపేశాడని అని వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ వి.శ్రీనివాస్, ఎస్‌ఐ పి.బుజ్జిబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనపర్తి సీహెచ్‌సీకి తరలించారు. 

విషాద ఛాయలు 
ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నబాబు తండ్రి రామకృష్ణకు ఇద్దరు కూమారులు. ఇటీవల పెద్ద కుమారుడు ప్రమాదం మరణించడంతో ఉన్న ఒక్క కొడుకుతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. నాలుగు నెలల గర్భిణి అయిన వెంకటలక్షి్మ.. ఏడాది వయసున్న కుమార్తె వినితతో చిన్నబాబు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచి వేసింది. 
 

మరిన్ని వార్తలు