ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు దురదృష్టకరం

27 Feb, 2021 03:54 IST|Sakshi
త్రిదండి చిన్న జీయర్‌ స్వామిజీకి జ్ఞాపికను అందిస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారిని దర్శించుకున్న త్రిదండి చిన్న జీయర్‌స్వామి

తిరుమల: ఆలయాల్లోని విగ్రహాలపై ఇటీవల దుండగులు దాడులు చేయడం దురదృష్టకరమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి అన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల చిన్నజీయర్‌ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి దూరం చేసే శక్తి కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఉందన్నారు. ఈ వ్యాధిని తట్టుకోగలిగే శక్తిని ప్రజలకు ఇవ్వాలని, దీన్ని రూపుమాపే శక్తి వైద్యులకు ఇవ్వాలని స్వామిని ప్రారి్థంచినట్టు తెలిపారు.   ఆలయాలు బాగుంటే ప్రజల్లో నైతిక ప్రవృత్తి బాగుంటుందన్నారు.

కొందరు దుండగులు ఆలయాలపై దాడులు చేసి హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రాముడి విగ్రహంపై దాడి జరగడం బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు కొన్ని సూచనలు ఇచ్చామన్నారు. ధ్వంసమైన 26 ఆలయాలను పరిశీలించామని, ఇందులో 17 ఆలయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించాలని చెప్పారు. ప్రభుత్వ పాలనను ప్రజలు ధర్మబద్ధంగా అందుకోవడానికి ఆలయ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. రాయలసీమ పర్యటనలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వీరి మధ్య అగ్ని రగిలించడం కోసం ఆలయాలను కూలగొడుతున్నారని, ఇలాంటి దృశ్యాలు బాధాకరమన్నారు.   

మరిన్ని వార్తలు