వేషం మార్చి.. పేరు మార్చి.. జనాన్ని ఏమార్చి! రూ.10 కోట్ల వరకూ..

27 Jan, 2023 05:13 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి: మహా మాయగాడి బండారం బయట పడింది. ఊరికో పేరు మార్చుకుంటూ చెలామణి అవుతూ అమాయకులను మోసం చేస్తోంది.. ఒక్కడే అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి ఇప్పటికే పలు చోట్ల జనాలను నిలువునా మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి.

ఒక్కో చోట ఒక్కో పేరుతో చెలామణి అవుతుండటంతో ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్‌గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత ఉడాయిస్తాడు. ఇప్పటికే నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లు, ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు.

ఆ తర్వాత బెయిల్‌పై వచ్చి ఊరు మార్చి.. కొత్త పేరుతో దందా కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డట్టు తేలింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మనోహర్‌రెడ్డి పేరుతో రూ.1.7 కోట్లతో పరారయినట్లు బాధితులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అక్కడ భాస్కర్‌రెడ్డిగా.. ఇక్కడ మనోహర్‌రెడ్డిగా..  
గతేడాది మేలో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్‌రెడ్డిగా పరిచయమయ్యాడు. అక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తానని నమ్మబలికాడు. స్టాక్‌ కోసం పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు కావాలని, రూ.లక్ష తనకిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది అతనికి డబ్బులిచ్చారు.

అక్కడ సుమారు రూ.3 కోట్ల వరకూ వసూలు చేసుకుని పరారయ్యాడు. అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి గాలివీడులో పట్టుకుని జైలుకు పంపారు. అవుకు కేసు నుంచి బయటికొచ్చాక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మకాం మార్చాడు. అక్కడ షేర్‌ మార్కెట్‌ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికాడు.

అధిక వడ్డీ ఇస్తానని కొన్ని రోజుల పాటు నమ్మించాడు. రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.1.7 కోట్లు వసూలయ్యాక పరార్‌ అవడంతో బాధితులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. అంతకుముందు అనంతపురం జిల్లా కణేకల్లు.. ఆత్మకూరులో కూడా అధిక వడ్డీ ఆశ చూపి కొందరితో డబ్బులు వసూలు చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి.  

మొదట్లో జులపాలు.. ఆ తర్వాత గుండు
రైల్వే కమ్మీలు చోరీ చేసిన కేసులో కూడా బెస్త చిన్న ఓబులేసే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపినా.. ఆ తర్వాత అనంతపురంలోని నాయక్‌ అనే ఓ లాయర్‌ను అడ్డు పెట్టుకుని సులువుగా బయటికొచ్చేస్తున్నాడు. చిన్న ఓబులేసు పేర్లు మార్చుకున్నట్లే వేషం కూడా మార్చేస్తాడు. మొదట్లో జులపాల జుట్టుతో ఖద్దర్‌ చొక్కా వేసి.. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు చైన్లు వేసుకుని దర్జాగా తిరుగుతాడు.

డబ్బులున్న వారితో టచ్‌లోకి వెళ్లి అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లి అమ్మాయిలతో ఎంజాయ్‌ చేస్తాడు. పోలీసులకు పట్టుబడే సమయానికి గుండుతో ఉంటాడు. నిత్యం డ్రెస్‌ కోడ్, బాడీ లాంగ్వేజ్‌ మార్చి విందు, వినోదాల్లో మునిగితేలుతుండాడు. విహార యాత్రల్లో ఉండగానే లాయర్లతో టచ్‌లోకి వెళ్లి.. కేసులకు సంబంధించి లాబీయింగ్‌ చేస్తాడని సమాచారం.  

మరిన్ని వార్తలు