ఇటు వ్యవసాయం.. అటు పూలసాగు

8 Apr, 2022 13:57 IST|Sakshi

అల్లూరి సీతారామరాజు జిల్లాకే తలమానికం చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం 

ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందజేత 

చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

1985లో ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 36 మండలాల్లోని ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కొత్త పంటలపై పరిశోధనలు చేయడంతో పాటు పొలాలకు వెళ్లి పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కొత్త పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయేతర పంటలైన గోధుమ, బార్లీ, లిన్‌సీడ్, బఠానీ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు వంటి పంటలపై పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు సాధించారు. 

ఈ పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.9 లక్షలతో సంచార వ్యవసాయ ప్రయోగశాల వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో బుల్లి తెరపై పంటలు, వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ రహిత ఆటోమెటిక్‌ శాటిలైట్‌ వెదర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇక్కడ వా తావరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం తెలుసుకుని.. ఏ పంటకు ఏ రకమైన తెగుళ్లు సోకే అవకాశముందో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో వాతావరణ సమాచారం 
వాతావరణ విభాగం శాస్త్రవేత్తగా సౌజన్యను నియమించారు. పరిశోధన కేంద్రంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్‌ శాటిలైట్‌ వెదర్‌ స్టేషన్‌ ద్వారా ప్రతి రోజూ నమోదైన వాతావరణ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. వాతావరణ వివరాలు నేరుగా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. వెంటనే ఆన్‌లైన్‌లో ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. ఐఎండీ వెబ్‌సైట్‌ హోం పేజీలోని ఏడబ్ల్యూఎస్‌ అబ్జర్వేషన్‌లోకి వెళ్లి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. 

గుబాళించిన పూల సాగు
మార్కెట్‌లో అలంకరణ పూలకు మంచి డిమాండ్‌ ఉంది. విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్‌ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గ్లాడియోస్, బంతి, జెర్బెరాలో వైట్‌హౌస్, సన్‌వ్యాలీ ఫోర్స్‌ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. శీతల వాతావరణంలో ఈ పూలను సాగు చేయవచ్చు. 

గిరిజనులను ప్రోత్సహిస్తాం 
వ్యవసాయ పంటలతో పాటు పూల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తాం. మైదాన ప్రాంతాల్లో కట్‌ఫ్లవర్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. గిరిజనులు అందిపుచ్చుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. 
– డాక్టర్‌ అనురాధ, ఏడీఆర్, చింతపల్లి పరిశోధన స్థానం  

మరిన్ని వార్తలు