భద్రాద్రి రాములోరి కల్యాణానికి చీరాల గోటి తలంబ్రాలు 

19 Mar, 2023 04:46 IST|Sakshi

తమ అదృష్టంగాభావిస్తున్న చీరాల వాసులు 

2015 నుంచి తలంబ్రాలుఅందిస్తున్న శ్రీరఘురామ భక్తసేవా సమితి 

స్థానికులతో పాటు విదేశాల్లోని వారికి క్రతువులో భాగస్వామ్యం 

నియమనిష్టలతో శాస్త్రోక్తంగా తలంబ్రాల తయారీ 

చీరాల: భద్రాద్రి సీతారాముల కల్యాణం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఎనలేని భక్తిభావం. అవకాశం ఉన్నవాళ్లు భద్రాద్రి వెళ్లి ఆ కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోతారు. వెళ్లలేని వాళ్లు టీవీల్లో వీక్షిస్తూనే భక్తిభావంతో ఉప్పొంగిపోతారు. సీతారాముల కల్యాణ క్రతువులో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తలంబ్రాలలో వినియోగించే బియ్యాన్ని గోటితో ఒలిచి స్వామివారికి సమర్పించే అవకాశం క్షీరపురిగా పిలిచే చీరాల వాసులకు వరుసగా తొమ్మిదోసారి దక్కింది.

సీతారాముల కల్యాణానికి వడ్లను గోటితో ఒలిచి ఇక్కడి నుంచి పంపించడం ఈ ప్రాంత ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఈ మహాసంకల్పానికి చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు పూనుకుని నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11మందితో ఏర్పాటైంది. వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం పూర్వజన్మ సుకృతంలా వచ్చింది.

తలంబ్రాల కొరకు వడ్లను ఎంతో శ్రమంచి ఒలిచి, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి.. నియమనిష్టలతో, శాస్త్రోక్తంగా తలంబ్రాలు చేస్తారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2015 అక్టోబర్‌ 23న చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో.. ఏటా వందలాది భక్తులు పాల్గొంటున్నారు. 

విదేశాల్లోని వారికీ భాగస్వామ్యం 
రాములోరి కల్యాణానికి అవసరమైన తలంబ్రాలను తయారు చేసే క్రతువులో స్థానికంగానే గాక దేశ, విదేశాల్లోని తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని 10 వేల మంది భక్తులు ఇందులో భాగస్వాములయ్యారు.

కమిటీ ప్రతినిధులు సీతారామ కల్యాణ వైభోగం, భద్రాద్రి సీతారామ కల్యాణం పేర్లుతో వాట్సాప్‌ గ్రూపులు ప్రారంభించారు. ఆసక్తి ఉన్న భక్తులను గ్రూపుల్లో చేర్చుకుని ఆయా ప్రాంతాలలో పర్యవేక్షకులుగా ఉన్న వారి ద్వారా భక్తులకు వడ్లు ఇచ్చారు. మరికొందరికి  కొరియర్‌ ద్వారా పంపారు. అమెరికా నుంచి నాలుగేళ్లుగా వక్కలగడ్డ వెంకటేశ్వరరావు, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలానే దక్షిణాఫ్రికాలో 400 మంది భక్తులు మూడు సంవత్సరాలుగా వడ్లు ఒలిచి పంపిస్తున్నారు. ఇక్కడ ఆత్మకూరి శ్రీనివాసరావు, అప్పాజోస్యుల వీరవెంకటశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 25న భద్రాద్రికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, భద్రాద్రికి తీసుకెళ్తారు.  

పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాం 
భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం మాకు కలగడం పూర్వజన్మ సుకృతమే. ప్రతి సంవత్సరం మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేస్తున్న విధానంపై దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే.  – పొత్తూరి బాలకేశవులు, చీరాల 

మరిన్ని వార్తలు