'బలహీన వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు'

20 Oct, 2020 14:42 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: సంవత్సరాలుగా పోరాడిన బీసీలకు దక్కని రాజ్యాధికారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం, 56 మందిని చైర్మన్లుగా, 728 మందిని డైరెక్టర్లుగా ఎంపిక చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. 'బీసీ మహిళగా ఉన్న తనను 20 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో అవమానాల పాలు చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి' అని అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. 'పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏడాదిన్నర కాలంలోనే  అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసిన ఘనత  సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది' అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృతపాణి, మాజీమంత్రి పాలేటి రామారావు,  బీసీ కమిషన్ మెంబర్ ముసలయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు