Chiranjeevi: అల్లూరి ఖ్యాతి ప్రపంచమంతా వ్యాప్తి

5 Jul, 2022 05:12 IST|Sakshi

ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి

సాక్షి, భీమవరం: మన్యం వీరుడు, త్యాగధనుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో అల్లూరి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా  భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరణ సభలో చిరంజీవి పాల్గొని మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనుండటం అద్భుతం, అమోఘమని కొనియాడారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు అల్లూరి అని కొనియాడారు. ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సేవాసమితి ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు మాట్లాడుతూ.. బ్రిటీష్‌ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ఆయన పేరుతో జిల్లా ఏర్పాటుచేయడం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. 

చిరంజీవికి సీఎం వైఎస్‌ జగన్‌ ఆత్మీయ ఆలింగనం
భీమవరంలో సభా వేదికపై చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

కాగా సభా వేదికపై చిరంజీవిని సీఎం వైఎస్‌  జగన్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో వారిద్దరి ఆత్మీయ కలయికను చూసి జనం ఉప్పొంగిపోయారు. ముందుగా చిరంజీవి వేదికపైకి చేరుకోవడంతో సభా ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. అనంతరం వేదికపైకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడటం చూసి సభికులు మరింత ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. తిరుగులేని ప్రజానాయకుడిగా వెలుగొందుతున్న సీఎం వైఎస్‌ జగన్, సినిమాల్లో తిరుగులేని హీరో చిరంజీవిని ఒకే వేదికపై చూసి ప్రజలు కరతాళధ్వనులతో తమ ఆనందం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు