జగనన్న విద్యాదీవెన నగదు అప్పునకు జమ

22 Apr, 2021 04:28 IST|Sakshi

చిట్టమూరు కెనరా బ్యాంకు మేనేజర్‌ నిర్వాకం 

లబోదిబోమంటున్న విద్యార్థుల తల్లులు

చిట్టమూరు: పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడిన జగనన్న విద్యాదీవెన పథకం సొమ్మును అప్పులకు జమకట్టుకున్న ఒక బ్యాంకు మేనేజరు నిర్వాకమిది. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు విడతలుగా ఇవ్వనున్న విద్యాదీవెన నగదును సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమచేసిన విషయం తెలిసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులోని కెనరా బ్యాంకులో ఖాతాలున్న విద్యార్థుల తల్లులు ఆ నగదును డ్రా చేసుకునేందుకు వెళ్తే బ్యాంకు మేనేజరు అడ్డుకున్నారు.

ఆ నగదును గతంలో వారు తీసుకున్న రుణాలకు జమ చేసుకున్నట్లు చెప్పారు. కొందరికి రుణాలు లేకపోయినా.. వారి బంధువులు తీసుకున్న రుణాలు కట్టిస్తేనే ఈ నగదును ఇస్తామని తెలిపారు. జగనన్న విద్యాదీవెన నగదును డ్రా చేసుకుని వారంలోగా కాలేజీలకు చెల్లించకపోతే మిగిలిన మూడు విడతలు జమ కావని ప్రభుత్వం ఓ వైపు హెచ్చరిస్తుండటంతో సుమారు 50 మంది తల్లులు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు మేనేజరు డబ్బు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏంచేయాలో దిక్కుతోచడంలేదని బాధపడుతున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.  

మరిన్ని వార్తలు