నాకు సొంతిల్లు లేదమ్మా.. మంజూరు చేస్తారా!

8 Aug, 2021 03:13 IST|Sakshi
సచివాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ పల్లవి

సామాన్యురాలిగా సచివాలయంలో చిత్తూరు డిప్యూటీ కలెక్టర్‌

కాసేపటికి అసలు విషయం తెలిసి అవాక్కయిన ఉద్యోగులు  

చిత్తూరు అర్బన్‌(చిత్తూరు జిల్లా): ఓ మహిళ శనివారం ఉదయం చిత్తూరులోని 36వ వార్డు సచివాలయంలో అడుగుపెట్టింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వద్దకు వెళ్లి తనకు సొంతిల్లు లేదని వాపోయింది. ఏడాది కిందట తిరుపతి నుంచి చిత్తూరుకు వచ్చానని తెలిపింది. దరఖాస్తు చేసి.. ఇల్లు మంజూరు చేయించాలని కోరింది. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సచివాలయానికి రావడంతో విషయం బయటపడింది. తమ ముందు నిల్చొని ఉన్నది డిప్యూటీ కలెక్టర్, గృహ నిర్మాణ ప్రత్యేకాధికారి పల్లవి అని తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు అవాక్కయ్యారు. 

చిత్తూరు డివిజన్‌ గృహ నిర్మాణ ప్రత్యేకాధికారిగా ఉన్న పల్లవి.. లక్ష్యం మేరకు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలని ఇటీవల ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు సామాన్యురాలిగా శనివారం ఆమె రంగంలోకి దిగారు. 36వ వార్డు సచివాలయానికి వెళ్లి.. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్‌ అనే విషయం బయటపడిన తర్వాత.. సచివాలయంలోని రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రజలకు సొంతిళ్లు నిర్మించడమే లక్ష్యంగా పని చేయాలని వారిని ఆదేశించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు