కరోనా మిగిల్చిన కన్నీటి గాథలు 

10 Jun, 2021 17:10 IST|Sakshi
భర్త చంద్రశేఖర్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన ఫొటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న సతీమణి దీప. కుమారులు మంజునాథ, సాయిప్రతాప్‌

కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌

అంతులేని వ్యథలు మిగులుస్తున్న మరణాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం గ్రామానికి చెందిన టి.చంద్రశేఖర్‌రెడ్డి (44) మే మొదటి వారంలో కరోనా బారినపడి మృతి చెందారు. ఆయనకు భార్య దీప, కుమారులు మంజునాథ, సాయిప్రతాప్‌ ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి తిరుపతిలో బియ్యం వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడ్డారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి కరోనా రూపంలో మృత్యువు ఆయనను కాటేసింది. ఆ కుటుంబాన్ని దిక్కులేని వాళ్లను చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుక్షణం ఆయన ఫొటో చూస్తూ రోదిస్తూనే ఉన్నారు. 

బిడ్డను పోషించుకోలేక.. 
తిరుపతి  కోలా వీధిలో నివాసం ఉన్న ఆటోడ్రైవర్‌ అల్లావుద్దీన్‌ (44)ను కరోనా కాటేసింది. ఈయనకు ఆరుగురు ఆడపిల్లలు ఉండగా.. తన రెక్కల కష్టంతోనే ఐదుగురికి వివాహం జరిపించారు. చిన్న కుమార్తె షమీమ్‌ 8వ తరగతి చదువుతోంది. ఆమెను కూడా చదివించి వివాహం చేస్తే ఆయన బాధ్యత తీరేది. ఈలోగానే కరోనా బారినపడిన ఆయన తనువు చాలించాడు. దీంతో ఆ కుటుంబానికి పోషణ భారమైంది. షమీమ్‌ చదువు నిలిచిపోయింది. ఆయన భార్య కృషీదా కుటుంబ పోషణ కోసం మహతి ఆడిటోరియం వద్ద పుట్‌పాత్‌పై కూరగాయల అమ్మకం చేపట్టింది.


ఇంటి అద్దె చెల్లించలేక కుమ్మరి తోపులోని ఒక చిన్న ఇంట్లోకి మారారు. దాతల సహకారంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించినా.. కర్ఫ్యూ కారణంగా వ్యాపార వేళలు కుదించడంతో వచ్చే ఆదాయం తినడానికే చాలడం లేదు. ఇంటి అద్దె ఎలా చెల్లించాలో కూడా తెలియక సతమతమవుతుండగా.. ఇంటి యజమాని వారి దీన స్థితి చూసి అద్దె అడగటం లేదు. ఇలా ఎంతకాలం నెట్టుకురావాలో తెలియక అల్లావుద్దీన్‌ భార్య కృషీదా అల్లాడుతోంది. 


చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఇలాంటి గాథలే కనిపిస్తున్నాయి. ఇంటి పెద్దలు దూరమవటంతో ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా మొదటి విడతతో పోలిస్తే రెండో వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. వయోభేదం లేకుండా యువకులు సైతం కరోనాకు బలవుతున్నారు.  

జిల్లాలో 12.07 శాతం మరణాలు
కోవిడ్‌–19 చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 1,412 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్‌ మరణాల్లో చిత్తూరు నగరానిదే అగ్రస్థానం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 11,696 మంది మృత్యవాత పడితే అందులో 12.07 శాతం మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదయ్యాయి. ఒక మరణం అనేక సమస్యలకు.. వేదనలకు దారి తీస్తోంది. మరణించిన వారి కుటుంబాల్లో అలముకున్న శూన్యాన్ని.. పెల్లుబుకుతున్న వేదనను తీర్చడం ఎవరివల్ల సాధ్యం కావటం లేదు. ‘ఇల్లు వదిలి బయటకు రావొద్దు.. కరోనా బారిన పడొద్దు’ అని పాలకులు, అధికారులు వైద్యులు పదపదే విజ్ఞప్తి చేస్తున్నా చెవికెక్కించుకోని సమాజం.. కనీసం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు