ఏనుగు వస్తే సైరన్‌ మోగుతుంది!

3 Jan, 2021 02:06 IST|Sakshi
పంటల్లోకి ఏనుగులు రాకుండా తయారు చేసిన పరికరాన్ని చూపుతున్న పవన్

పంటల్లోకి ఏనుగులు రాకుండా కట్టడి చేసే పరికరం 

పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తాకగానే సైరన్, లైట్‌ 

సాక్షి, పలమనేరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీ నుంచి సోలార్‌ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి రైతుల పంటల్లోకి వస్తున్న ఏనుగుల సమస్యకు మండలంలోని మొరం గ్రామానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్త పవన్‌ ఓ పరికరాన్ని కనుగొన్నాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులు దీన్ని అమర్చుకొని ఏనుగుల బెడద నుంచి ఉపశమనం పొందారు.  

ఇదెలా పనిచేస్తుందంటే.. 
అడవికి ఆనుకుని పంటలు సాగుచేసే రైతులు చేలకు తొలుత రాతి స్తంభాలు, లేదా కర్రలతో జియో వైరును లాక్కోవాలి. పొలంలో ఓ చోట సోలార్‌ ప్యానల్, పవన్‌ తయారు చేసిన పరికరాన్ని అమర్చుతాడు. ఈ పరికరం సోలార్‌ సాయంతో పనిచేస్తుంది. పొలంలోని ఫెన్సింగ్‌ నుంచి వైర్లను గదిలో లేదా ఎక్కడైనా ఉంచిన పరికరానికి అనుసంధానం చేస్తారు. దీంతో పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను ఏనుగు టచ్‌ చేయగానే పరికరంలోని అలా రం గట్టిగా మోగడంతో పాటు ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. ఫెన్సింగ్‌ను టచ్‌చేస్తే తక్కువ మోతాదుతో కరెంట్‌ షాక్‌ కొడుతుంది. ఇది రెండు సెకన్లు మాత్రమే. చదవండి: (ఏఐ రంగంలో అగ్రపథాన తెలంగాణ)

దీంతో ప్రాణాపాయం ఉండదు. ఫలితంగా ఏనుగు భయపడి వెనక్కి వెళ్తుంది. ఇదే సమయంలో చుట్టుపక్కల రైతులు, ఫారెస్ట్‌ అధికారుల మొబైల్‌కు కాల్స్‌ ఏకకాలంలో వెళ్తాయి. రైతుల ఫోన్లకు రింగింగ్‌ టోన్‌గా ఏనుగులు వచ్చాయ్‌ అంటూ మోగడంతోపాటు మొబైల్‌ స్క్రీన్‌పై ఏనుగుల పిక్చర్‌ డిస్‌ప్లే అవుతుంది. దీంతో రైతులు, ఫారెస్ట్‌ శాఖ అప్రమత్తమవుతారు. బీట్‌లోని ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ అక్కడికి చేరుకొని ఏనుగులను అడవిలోకి మళ్లిస్తారు. ఫలితంగా రైతుల పంటకు రక్షణ దొరుకుతుంది. 
సెల్‌ఫోన్‌ సాయంతోనే దీన్ని ఆన్‌ ఆఫ్‌ చేయవచ్చు. 

రైతులకు అందుబాటు ధరలతో.. 
రైతుల పొలాల ఎకరాలను బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలతో ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చునని పవన్‌ తెలిపాడు. ఇందుకోసం 100 వోల్టుల సోలార్‌ ప్యానల్, ఆరు రోజులు కరెంటును నిల్వ ఉంచుకొనే 100 య్యాంప్స్‌ బ్యాటరీ, 12 వోల్టుల ఎనర్జలైజర్‌ తదితరాలను ఉపయోగించాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులకు అమర్చాడు. స్థానిక అటవీశాఖ అధికారులు సైతం ఈ పరికరం పనితీరును ప్రత్యక్షంగా గమనించి సంతృప్తిని వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు