చినబాబుకు షాక్‌.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి..

4 Mar, 2023 16:38 IST|Sakshi

అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి అన్నట్లు యువగళం పాదయాత్రతో కేడర్‌లో జోష్‌ నింపాలని చినబాబు భావిస్తే.. ఉన్న నేతలే పార్టీ నుంచి వెళ్లితున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని ఆలోచిస్తే.. సరైన గౌరవం దక్కలేదని సీనియర్లు గుర్రుమంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేద్దామనుకుంటే.. ఇన్నేళ్లు వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు జెండా వదిలేస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్‌ తన అవగాహనరాహిత్యంతో తమ్ముళ్ల మధ్య చిచ్చుపెట్టేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీని బలోపేతం చేయడం సంగతి దేవుడెరుగు.. వర్గపోరును రాజేసి విభేదాలు సృష్టిస్తున్నారు. చినబాబు వ్యవహారశైలి నచ్చక సీనియర్‌ నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఒకరొకరుగా టీడీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.

సాక్షి, చిత్తూరు : నిస్తేజంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. అది కూడా తన తండ్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే జనవరి 27వ తేదీన ప్రారంభించారు. ఇప్పటి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. అయినప్పటికీ పార్టీలో మాత్రం ఉత్తేజం ఏమాత్రం కనిపించటం లేదు. పార్టీ కేడర్‌కు లోకేష్‌ పాదయాత్ర భరోసా కల్పించలేకపోయింది. ఏ నియోజకవర్గంలోనూ పాదయాత్ర, సభలు సక్సెస్‌ అని చెప్పుకునే పరిస్థితి కనిపించలేదు.

సామాజిక మాధ్యమాల్లో వెలవెలబోతున్న లోకేష్‌ సభల ఫొటోలు, వీడియోలు హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. ఇలాంటివాటిపై స్వయంగా లోకేష్‌ ఆ పార్టీ సీనియర్‌ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో పెయిడ్‌ ఆర్టిస్టులు, జనాలను వాహనాల్లో తీసుకొచ్చి పాదయాత్ర కొనసాగించటంలో నేతలు తలమునకలయ్యారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో పాదయాత్రకు ఎక్కడికక్కడ బ్రేక్‌ తీసుకుంటూ కొనసాగిస్తున్నారు.

ఆగ్రహంలో సీనియర్లు
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జెండాను కొందరు నేతలు మోస్తూనే ఉన్నారు. కష్టకాలంలోనూ కొందరు సీనియర్లు ఆ పార్టీని వీడలేదు. కానీ, లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర అలాంటి వారిని డైలమాలో పడేసిందనడంతో ఏమాత్రం సందేహం లేదు. అంతగా రాజకీయ అనుభవం లేని లోకేష్‌ పార్టీలోని సీనియర్లను చిన్నచూపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన కొత్త ముఖాలకు బాధ్యతలన్నీ అప్పగించటంపై కొందరు సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. సమయం చూసి తమ అసమ్మతి గళం వినిపించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

సందీప్‌ దారిలో మరికొందరు?
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి మహదేవ సందీప్‌నాయుడు చాలా దగ్గర. ఒకప్పుడు ఆయన తండ్రి మహదేవ నాయుడు అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ కారణంగానే సందీప్‌కు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. అయితే లోకేష్‌ పాదయాత్రలో ఆయనకు పూర్తి తిరస్కారమే ఎదురైంది. దీంతో బీసీ నేతలు సిపాయి సుబ్రమణ్యం , షణ్ముగం వెళ్లిన దారినే ఆయన ఎంచుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే సందీప్‌ నాయుడే అలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడితే? భవిష్యత్‌లో తమకూ ఇక్కట్లు రావచ్చని పలువురు నేతలు అనుకుంటున్నట్లు తెలిసింది. చేతులు మరింతగా కాలకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

టికెట్‌కు లేని భరోసా
రాబోయే సాధారణ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న నేతలు లోకేష్‌ పాదయాత్రలోముందుంటున్నారు. కానీ, టికెట్‌ వస్తుందని ఆశిస్తున్న నేతలకు లోకేష్‌ ఏమాత్రం హామీ ఇవ్వటం లేదు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి మొండిచెయి చూపినట్టు ఆ పార్టీ నేతలే గుసగులాడుతున్నారు. టికెట్‌ ఇస్తారా..? లేదా..? అన్నది కూడా లోకేష్‌ తేల్చకపోవడంతో ఆశనిరాశల నడుమ ఊగిసలాడుతున్నారు.

మరిన్ని వార్తలు