జాక్‌పాట్‌ కొట్టిన రైతులు.. టమాటా సాగుతో 45 రోజుల్లో రూ. 3 కోట్ల ఆదాయం

30 Jul, 2023 18:58 IST|Sakshi

గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న టమాటాధరలు.. ఎంతకీ దిగిరావడం లేదు. పోనూ పోనూ ఇంకా ప్రియంగా మారుతూ.. సామాన్యుడికి భారంగా మారింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.200 చేరి కొత్త రికార్డులు సృష్టిస్తుంది.

అయితే పెరిగిన టమాటా ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే.. వీటిని పండించిన రైతుల ఇంట మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కనివినీ ఎరగని రీతిలో కొంతమంది రైతులు ధనవంతులు అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటతో జాక్‌పాట్‌ కొట్టింది. 22 ఎకరాల్లో టమాటాసాగు చేసి.. 45 రోజుల్లో ఏకంగా మూడుకోట్లు సంపాదించారు.

భూదేవిని నమ్ముకున్న రైతులు ఏ రోజుకైనా రాజులవుతారని నిరూపించారు రైతులు చంద్రమౌళి, మురళి. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన రైతు కుటుంబంలోని అన్నదమ్ములు చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. స్వగ్రామమైన కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారి పల్లెలో 10 ఎకరాల పొలంలో 23 సంవత్సరాలుగా టమాటను సాగు చేస్తున్నారు.


చదవండి: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!!

22 ఎకరాల్లో టమాటా సాగు
తన వంగడాలు, మార్కెట్ స్థితిగతుల గురించి బాగా అవగాహన పెంచుకున్న చంద్రమౌళి.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో  మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం అరుదైన సాహు రకానికి చెందిన టమాటా మొక్కలను 22 ఎకరాలలో సాగు చేశారు. త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులను అనుసారించాడు. దాదాపుగా 70 లక్షల వరకు పంటపై ఖర్చు చేయగా.. జూన్ చివరి వారంలో దిగుబడి ప్రారంభమైంది.

రూ. 4 కోట్ల ఆదాయం.. ఖర్చులు పోనూ!
ఈ పంటను తమ ప్రాంతానికి దగ్గరల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ మార్కెట్లో విక్రయించారు. అక్కడ 15 కేజీల బాక్స్ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 మధ్య పలికింది. గత 45 రోజుల్లో సుమారుగా 40 వేల పెట్టెలు విక్రయించాడు. తనకొచ్చిన లాభంపై రైతు చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..ఇప్పటి వరకు పండించిన పంట ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు.  మొత్తంగా  22 ఎకరాల్లో పంట కోసం అన్నీ ఖర్చులు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగా... రూ. 3 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు.

రికార్డు స్థాయిలో ధరలు
మరోవైపు భారత్‌లోనే అతిపెద్ద టమటా మార్కెట్‌లలో ఒకటిగా ఉన్న మదనపల్లెలో టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. మొదటి గ్రేడ్ టమోటా కిలో ధర శుక్రవారం రూ. 200 రూపాయలు పలికింది. రెండు వారాల క్రితం కిలో టమాటారూ.120 ఉండగా.. 25 కిలోల డబ్బాను రూ.3 వేలకు విక్రయించారు. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టమాటకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.200కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు టమాటా ధరలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.

చదవండి: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం

మరిన్ని వార్తలు