పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్‌ 

28 Nov, 2022 02:56 IST|Sakshi
చిత్తూరు జిల్లాలో నాగరాజకుప్పం లేఅవుట్‌–1లో నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లు

ఈ జిల్లాలో 63 వేల ఇళ్లకు శంకుస్థాపన  

52 వేల ఇళ్ల నిర్మాణం పునాది ఆపై దశల్లో..   

తర్వాతి స్థానాల్లో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు 

రాష్ట్రవ్యాప్తంగా రెండుదశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి 

మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రతి శనివారం ‘హౌసింగ్‌ డే’  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే తొలినుంచి మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో 73,496 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 63,517 ఇళ్లకు శంకుస్థాపన చేశారు.

ఇందులో 52,386 ఇళ్లు (82 శాతం) పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. శంకుస్థాపన చేసిన 67,437 ఇళ్లలో 42,964 (64 శాతం) ఇళ్లు, 70,221 ఇళ్లలో 42,554 (61 శాతం) ఇళ్లు పునాది, ఆపై దశల నిర్మాణంతో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1.35 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది.

వీటిలో 63,389 ఇళ్లకు శంకుస్థాపన చేయగా 9,043 ఇళ్లు పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలో చివరిస్థానంలో ఉంది. న్యాయపరమైన చిక్కులు వీడటంతో విశాఖపట్నం కార్పొరేషన్‌ పరిధిలో నిర్మిస్తున్న 1.24 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అనుమతులు లభించాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు ఇటీవల ప్రారంభం కావడం విశాఖ చివరిస్థానంలో ఉండటానికి ప్రధాన కారణం.  

పుంజుకున్న నిర్మాణాలు 
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం రెండుదశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు. మిగిలిన 18.63 లక్షల ఇళ్లకుగాను 15.15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

వీటిలో 8.70 లక్షల ఇళ్లు పునాది ముందుదశలో, 2.85 లక్షల ఇళ్లు పునాది, 73,622 ఇళ్లు రూఫ్‌ లెవల్, 1.05 లక్షల ఇళ్లు ఆర్సీ దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,79,263 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇందులో 95 వేలకుపైగా ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు.  

హౌసింగ్‌ డే రోజు సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్‌ వరకు లేఅవుట్‌ల సందర్శన 
పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తొలినుంచి ప్రత్యేకదృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారాన్ని హౌసింగ్‌ డేగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో శనివారం కలెక్టర్లు, జేసీలు, డివిజన్, మండలస్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది లేఅవుట్‌లను సందర్శిస్తున్నారు. అధికారులు తాము లేఅవుట్‌లను సందర్శించిన ఫొటోలను గృహనిర్మాణ సంస్థ రూపొందించిన హౌసింగ్‌ డే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

లేఅవుట్‌లలో తమదృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను యాప్‌ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 19న 961 లేఅవుట్‌లను 5,548 మంది మండల స్థాయి అధికారులు, 3,051 మంది సచివాలయాల స్థాయి అధికారులు సందర్శించారు.  

రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం 
ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా ఆయా జిల్లాలకు రాష్ట్రస్థాయి అధికారులం వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్‌ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్‌లు సందర్శించాల్సి ఉంటుంది. లేఅవుట్‌లో సందర్శించినట్టుగా ఫొటోలను హౌసింగ్‌ డే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించాం.  
– అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ  

మరిన్ని వార్తలు