దొంగకు ఖాకీ మద్దతు..తొమ్మిది నెలలుగా కేసు చేధించకుండా..

7 Feb, 2023 09:44 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి: ‘నా ఇంట్లో చోరీ జరిగి 9 నెలల వుతోంది. 20 తులాల బంగారాన్ని అపహరించుకెళ్లారు. ఈ సొత్తు రికవరీలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న హోంగార్డు నాగరాజు నాయక్‌.. పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు స్టేషన్‌కెళ్లి సీఐను కలిసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా నన్నే దుర్భాషలాడుతూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ ఎదుట హోంగార్డు లక్ష్మణ నాయక్‌ వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీని కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు.   

పుట్టపర్తిలోని శిల్పారామం సమీపంలో నివాసముంటున్న లక్ష్మణ నాయక్‌ ఇంట్లో 2022, జూన్‌ 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ.11 వేలను అపహరించుకెళ్లారు. గోకులం ప్రాంతానికి చెందిన కాటమయ్య, హోంగార్డు నాగరాజు నాయక్‌ను అనుమానితులగా పేర్కొంటూ అప్పట్లో పుట్టపర్తి అర్బన్‌ పోలీసులకు లక్ష్మణ నాయక్‌ ఫిర్యాదు చేశాడు. నాగరాజు నాయక్‌పై గతంలోనూ చోరీ కేసులున్నాయని అందులో గుర్తు చేశాడు.

బైక్‌ చోరీ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి వచ్చిన నాగరాజు నాయక్‌ను పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చేరదీసి డ్రైవర్‌గా పెట్టుకున్నారని వివరించాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో అంతులేని నిరక్ష్యం కనబరుస్తున్నారని బాధితుడు వాపోయాడు. చోరీ సొత్తు రికవరీ చేసివ్వాలంటూ స్టేషన్‌కెళ్లి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయాడు. పైగా ‘ఎమ్మెల్యేతో ఫోన్‌చేయిస్తే బంగారాన్ని రికవరీ చేయాలా? నా దగ్గర పనిచేసే డ్రైవర్‌ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకోసారి స్టేషన్‌కు వస్తే బాగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరాడు.   

63 వినతులు.. 
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. తొలుత ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ అర్జీలు స్వీకరించి, పరిశీలించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ చేరుకుని అర్జీదారులతో మాట్లాడి సమస్య తీవ్రతపై ఆరా తీశారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు.    

(చదవండి: కనుమరుగవుతున్న కష్టజీవి..)

మరిన్ని వార్తలు