ఆశావర్కర్‌ అనిత కేసు ఓ డ్రామా

20 Apr, 2021 10:38 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత బురద రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఆశావర్కర్ అనితను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సీఐ విజయభాస్కర్‌ వెల్లడించారు. చెర్లోపల్లిలో లైంగిక వేధింపులపై ఆశావర్కర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే, నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించారు.

అనిత కేసు ఓ డ్రామాగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తారని అనిత అపోహ పడిందని సీఐ విజయభాస్కర్‌ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో అనిత కేసు పెట్టిందని సీఐ పేర్కొన్నారు. అనిత ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా, ఆమె పాయిజన్ తీసుకోలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని సీఐ విజయభాస్కర్‌ పేర్కొన్నారు.  

పరిటాల సునీత మహానటి..
సాక్షి, అనంతపురం: రాప్తాడు మండలం చెర్లోపల్లి ఆశావర్కర్‌ ఘటనను టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  మండిపడ్డారు. పరిటాల సునీత చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ పరిటాల వర్గమే అని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్ అనిత టీడీపీ ట్రాప్‌లో పడిందని తెలిపారు. పరిటాల సునీత మహానటి అనే విషయం అందరికీ తెలిసిందేనని, తాజాగా ఆశా వర్కర్‌ ఘటనను రాజకీయం చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఓ చిరుద్యోగిని అడ్డుపెట్టుకుని రాజకీయానికి సిద్ధమయ్యారన్నారు.

జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆశా వర్కర్‌ అనిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆశా వర్కర్‌ కుటుంబం వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులని, తమలో తమకే చిచ్చు పెట్టేందుకు సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల శ్రీరాంపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని.. వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తానేనని శ్రీరాం ఒప్పుకున్నా... ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

చదవండి: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి

మరిన్ని వార్తలు