ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ దాడులు

11 Apr, 2021 04:24 IST|Sakshi
తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో వైద్య పరికరాలను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా 1,315 ఆస్పత్రుల్లో ఆకస్మిక సోదాలు

13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాల విస్తృత తనిఖీలు

వైద్య పరికరాల పనితీరు.. వాటి ధరలు, రికార్డులు పరిశీలన

సాక్షి, అమరావతి: వైద్య పరికరాల నిర్వహణ కుంభకోణాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,315 ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ శనివారం ఏకకాలంలో దాడులు చేసింది. సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి సోదాల్లో పాల్గొన్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలెన్ని? వాస్తవంగా పని చేస్తున్నవి(వర్కింగ్‌ కండీషన్‌) ఎన్ని? వాటి మార్కెట్‌ ధర ఎంత? వారెంటీ ఎన్నేళ్లు ఉంది? ఏఏ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు? ఆయా సంస్థలకు నిర్వహణ సేవల కోసం ఎంత మొత్తం చెల్లించారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు.

క్షేత్రస్థాయి వాస్తవాలతో ఓ నివేదిక రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన కుంభకోణంపై సెక్షన్‌ 420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతో రూ.కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యవహారంలో క్షేత్రస్థాయి ఆధారాలు సేకరించే దిశగా సీఐడీ ముందుకు వెళ్తోంది. బెంగళూరుకు చెందిన టీబీఎస్‌ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్‌ సర్వీసెస్‌ సంస్థకు 2015లో ఏడాది కాలానికి టెండర్‌ ఖరారు చేసిన దగ్గర్నుంచి.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం దాకా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలుండటంతో.. వాస్తవంగా పరికరాల వినియోగం గురించి సీఐడీ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. 

వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం
వైద్య పరికరాల నిర్వహణ సేవల పేరుతో జరిగిన కుంభకోణంలో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించాం. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది? అనే కోణంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నాం. పరికరాల విలువ ఎంత? పనిచేస్తున్నవి ఎన్ని? కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? అనే వివరాలను సేకరిస్తున్నాం.  వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం. అనంతరం దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 
– సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌  

మరిన్ని వార్తలు