విద్వేషాలు రెచ్చగొట్టేలా అంకబాబు దుష్ప్రచారం: సీఐడీ కీలక వ్యాఖ్యలు

24 Sep, 2022 09:26 IST|Sakshi

సాక్షి,అమరావతి/నగరంపాలెం(గుంటూరువెస్ట్‌): ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగిస్తూ, సమాజంలో విద్వేషాలు రగిలించేలా తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందునే కొల్లు అంకబాబును అరెస్టు చేశామని సీఐడీ విభాగం తెలిపింది. తాము ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులను తీసుకునేందుకు తిరస్కరించడంతో పాటు తన మొబైల్‌ ఫోన్‌లోని ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని శుక్రవారం సీఐడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

గతంలో ఈనాడు, ఉదయం పత్రికలు, హెచ్‌ఎంటీవీలలో జర్నలిస్టుగా చేసిన అంకబాబు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారని చెప్పింది. ‘సీఎంవోలోని ఓ కీలక అధికారి భార్య దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడినట్టు, ఆమెతో పాటు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని కస్టమ్స్‌ అధికారులు విచారిస్తున్నట్లు’ ఓ అవాస్తవ పోస్టును అంకబాబు ఈనెల 9న సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. వాస్తవానికి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు జప్తు చేసిన బంగారంతో సీఎంవో అధికారులకు ఎలాంటి సంబంధంలేదని తెలిపింది. 

అంకబాబు ఉద్దేశపూర్వకంగానే సీఎంవో ప్రతిష్ట దెబ్బతీసేందుకు, సమాజంలో వర్గవిద్వేషాలు సృష్టించేందుకే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని సీఐడీ విభాగం వివరించింది. అంతేకాకుండా ఈ దుష్ప్రచార పోస్టులను వైరల్‌ చేయడంలో ఆయన సూపర్‌ స్ప్రెడర్‌గా వ్యవహరించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఫేక్‌ పోస్టులపై సీఐడీ అధికారులు పలువురిని విచారించినపుడు ఈ విషయం వెలుగుచూసింది. వారందరి మొబైల్‌ఫోన్లకు కూడా ఆ ఫేక్‌ పోస్టు అంకబాబు మొబైల్‌ ఫోన్‌ నుంచే వచి్చనట్లు నిర్ధారణ అయ్యింది. 

వివిధ వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో కూడా సీఎంవోపై దుష్ప్రచారం వెనుక అంకబాబే కీలకపాత్ర పోషించారని సీఐడీ విభాగం ఆధారాలు సేకరించింది. వీటి ఆధారంగానే కొన్ని టెలివిజన్‌ చానళ్లలో కూడా ఈ దుష్ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. తద్వారా వివిధ మాధ్యమాల ద్వారా ఒకే సమయంలో పెద్దఎత్తున దుష్ప్రచారం చేసేలా అంకబాబు వ్యవహరించారన్నది స్పష్టమైంది. దాంతో ఆయన్ని విజయవాడలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని అతని మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులోనుంచి పంపిన పోస్టుల వివరాలు సేకరించామని చెప్పింది. ఆర్థిక నేరాలకు సంబంధించి అంకబాబుపై గతంలో కృష్ణా, పశి్చమ గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో 20 వరకు కేసులు నమోదయ్యాయని కూడా సీఐడీ విభాగం వెల్లడించింది. కొన్ని మనీ సర్క్యులేషన్‌ స్కీముల పేరిట కూడా ఆయన మోసాలకు పాల్పడ్డారని సీఐడీ గుర్తించింది.  

గుంటూరులో విచారణ 
అంకబాబును సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంకబాబుని వైద్య పరీక్షలు నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు తదుపరి ఎక్సైజ్‌ కోర్టులో హాజరు పరచగా, బెయిల్‌ మంజూరు చేశారు. అంకబాబుని అరెస్ట్‌ చేయడంతో టీడీపీ నాయకులు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంకబాబు అరెస్టు సరికాదు: చంద్రబాబు 
సాక్షి, అమరావతి: సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబు అరెస్ట్‌ సరికాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. విజయవాడలో అంకబాబు అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని కోరారు. వాట్సాప్‌ పోస్ట్‌ పేరుతో అరెస్టు చేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో మొదలైన అక్రమ అరెస్టులు.. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు, రాజధాని ఉద్యమకారుల వరకు వచ్చాయని తెలిపారు.
 

మరిన్ని వార్తలు