ఎవరి ప్రోద్బలంతో.. ఎవరి కోసం చేశారు?

30 Apr, 2021 09:38 IST|Sakshi
సీఐడీ కార్యాలయం వద్ద దేవినేని ఉమా

వీడియో మార్ఫింగ్‌పై టీడీపీ మాజీ మంత్రి ఉమాను ప్రశ్నించిన సీఐడీ

పబ్లిక్‌ డొమైన్‌ నుంచి తీసుకున్నట్టు బుకాయింపు

10 గంటలపాటు ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు

రేపు మరోసారి విచారణకు రావాలని సీఐడీ ఆదేశాలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్‌ చేసి అనని మాటలను అన్నట్టుగా ఎందుకు చూపించారు? ఎవరి ప్రోద్బలంతో చేశారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు ఆపని చేశారు?.. అంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉమాను దాదాపు 10 గంటలపాటు సీఐడీ దర్యాప్తు అధికారులు పదేపదే ప్రశ్నించినా ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ వీడియోను మార్ఫింగ్‌ చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ నెల 7న దుష్ప్రచారం చేసిన ఉమాపై కర్నూలులో సీఐడీ ఈ నెల 9న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన కోర్టును ఆశ్రయించారు.

విచారణకు సహకరించాలన్న కోర్టు డైరెక్షన్‌ మేరకు ఆయన గురువారం మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. సీఐడీ కార్యాలయంలోని ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన ప్రత్యేక గదిలో ఉదయం 10.40 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీఐడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో, ఆడియోను మార్ఫింగ్‌ చేసి తిరుపతిలో మత విద్వేషాలు, అలజడులు రేపేందుకు ఎందుకు కుట్ర చేశారని, ఇందులో మీకు ఎటువంటి ప్రయోజనాలున్నాయని ప్రశ్నించినట్టు సమాచారం. వీడియో మార్ఫింగ్‌ ఎలా చేశారని, ఎందుకు చేశారని ప్రశ్నించగా.. ఆ వీడియోను తాను పబ్లిక్‌ డొమైన్‌ నుంచి తీసుకున్నట్టు ఉమా బదులిచ్చారని తెలిసింది.

తిరుపతి ప్రెస్‌మీట్‌లో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్‌ వీడియో ప్రదర్శించిన సెల్‌ఫోన్, ట్యాబ్‌ గురించి సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో ఆయన సమాధానం దాటవేసినట్టు తెలిసింది. దాదాపు 10 గంటలపాటు సాగిన విచారణలో పదేపదే అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో వాస్తవాలు రాబట్టేందుకు శనివారం (మే 1వ తేదీ) మరోసారి విచారణకు హాజరుకావాలని ఉమాను సీఐడీ అధికారులు ఆదేశించారు. ఉమా ఉపయోగించిన సెల్‌ఫోన్, ట్యాబ్‌లతోపాటు సీఐడీ అధికారులు అడిగిన ఆధారాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు అందజేయాలని కోరినట్టు తెలిసింది. తొలిరోజు విచారణలో ఉమా చెప్పిన విషయాలను సీఐడీ అధికారులు రికార్డు చేసినట్టు తెలిసింది.

చదవండి: ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ  
‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం

మరిన్ని వార్తలు