‘అసైన్డ్‌’ స్కామ్‌లో సీఐడీకి కీలక ఆధారాలు!

24 Mar, 2021 04:57 IST|Sakshi

హైకోర్టులో కౌంటర్‌ దాఖలుకు కసరత్తు

న్యాయ నిపుణులతో దర్యాప్తు అధికారుల సంప్రదింపులు

అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన 

సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణంపై విచారణ నిర్వహిస్తున్న సీఐడీ దర్యాప్తు అధికారులు తాజాగా కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఫిర్యాదుదారైన ఆర్కే, అప్పటి గుంటూరుæ జాయింట్‌ కలెక్టర్, సీఆర్‌డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్‌ను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అసైన్డ్‌ భూముల కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీలు ఉన్నట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో దీన్ని ఎత్తివేసేలా ప్రాథమిక ఆధారాలతో కౌంటర్‌ దాఖలు చేయడంపై సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు సేకరించిన పలు ఆధారాలను కూడా న్యాయస్థానానికి నివేదించనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో క్షుణ్నంగా దర్యాప్తు జరిపేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

మరిన్ని వార్తలు