టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు

16 Apr, 2021 08:56 IST|Sakshi

 సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో మార్ఫింగ్‌ కేసు

సాక్షి, అమరావతి/కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో, ఆడియోను మార్ఫింగ్‌ చేసి తిరుపతిలో మత విద్వేషాలు, అలజడులు రేపేందుకు కుట్ర చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసు జారీ చేసింది. తిరుపతి ఉప ఎన్నికలకు వెళ్లిన దేవినేని ఉమ ఈ నెల 7వ తేదీన మీడియా సమావేశం నిర్వహించి సీఎం వైఎస్‌ జగన్‌ వీడియోలను మార్ఫింగ్‌ చేసి ప్రదర్శించారు. దానిపై ఉమ ట్వీట్‌ కూడా చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే కుట్ర పన్నారు. దీనిపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ మార్ఫింగ్‌ వీడియో వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది.

2014 ఏప్రిల్‌ 13న వైఎస్సార్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన విలేకరుల సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్‌ చేసి, వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్టు తేలింది. దీనిపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.నారాయణరెడ్డి ఈ నెల 9న కర్నూలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమపై ఐపీసీ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్లతో కేసు నమోదు చేసిన కర్నూలు సీఐడీ డీఎస్పీ సీహెచ్‌ రవికుమార్‌ దర్యాప్తు చేపట్టారు.

కేసు దర్యాప్తులో భాగంగా సీఎం జగన్‌ వీడియోను మార్ఫింగ్‌ చేసి ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన ట్యాబ్, ఫోన్‌లను తీసుకుని కర్నూలు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ ఉమకు డీఎస్పీ రవికుమార్‌ గురువారం నోటీసు జారీ చేశారు. నోటీసు గురించి తెలియజేసేందుకు ఉమామహేశ్వర రావుకు ఫోన్‌ చేయగా అందుబాటులోకి రాలేదని, వాట్సాప్‌ నంబర్‌ 9848035405కు 14వ తేదీ రాత్రి 9.06 గంటలకు మెసేజ్‌ పంపినట్లు డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు. నోటీసును స్వయంగా అందజేయడానికి విజయవాడ గొల్లపూడిలోని ఆయన ఇంటి వద్దకు కర్నూలు సీఐడీ పోలీసులు వెళ్లగా ఆయన లేనందున ఇంటికి నోటీసు అతికించి, అతని అనుచరునికి తెలియజేసినట్లు తెలిపారు.
చదవండి:
‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం  
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! మే 31న ఉద్యోగ క్యాలెండర్‌

మరిన్ని వార్తలు