మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

18 Mar, 2021 03:04 IST|Sakshi
నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజీ ఆవరణ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐడీ బృందం

ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసు.. 

నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు 

సాక్షి, అమరావతి, నెల్లూరు రూరల్‌: రాజధాని అమరావతి ముసుగులో అక్రమంగా అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, బదలాయింపు కేసులో ఏ–2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీఐడీ బుధవారం పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపింది. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడలోని పది ప్రాంతాల్లో సీఐడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. సీఆర్‌డీఏ వైస్‌ చైర్మన్‌గా రాజధాని వ్యవహారాలను నారాయణ పర్యవేక్షించడం తెలిసిందే. అసైన్డ్‌ భూముల స్కామ్‌ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏ – 1గా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.

ఇదే కేసులో ఏ – 2గా ఉన్న మాజీ మంత్రి నారాయణకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే నారాయణ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి లోధా బెల్లేజ 1(ఏ) టవర్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఐపీసీ సెక్షన్లు 120 బి, 166, 167, 217 కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపింది.
నోటీసు అందినట్లు పేర్కొన్న నారాయణ సతీమణి  

పలు కీలక ఫైళ్లు స్వాధీనం
నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు విస్త్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాల ఆవరణలోని నారాయణ ఇంటికి ఉదయాన్నే చేరుకున్నారు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ జూనియర్‌ కళాశాల, రూరల్‌ పరిధిలోని ధనలక్ష్మిపురం, ముత్తుకూరు మండలంలోని విద్యాసంస్థల్లో కూడా తనిఖీలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ తనిఖీల్లో పలు కీలక ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీల్లో అమరావతి సీఐడీ విభాగం డీఎస్పీ రవికుమార్, సీఐలు వెంకటేశ్వర్లురెడ్డి, నాయక్‌
తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు