జూమ్‌లో.. కామ్‌గా ఆధారాలు ధ్వంసం!

26 Apr, 2023 03:01 IST|Sakshi

మార్గదర్శి యాజమాన్యం అర్ధరాత్రి ‘మేనేజ్‌మెంట్‌’

రికార్డులు డిలీట్‌ చేయండి... ఏ ఒక్కటీ దొరక్కూడదు

చిట్స్‌ బ్రాంచీల సిబ్బందికి హైదరాబాద్‌ నుంచి ఆదేశాలు

జూమ్‌ మీటింగ్‌లో ప్రాక్టికల్‌గా చూపించిన ‘పెద్దలు’

తమ వివరాలు ఏమవుతాయోనన్న ఆందోళనలో ఖాతాదారులు.. ఇప్పటికే 2,3 నెలలుగా డబ్బులు అందక చిట్‌ పాటదారుల తిప్పలు

ష్యూరిటీలు సహా రకరకాల కారణాలతో జాప్యం చేస్తున్న మార్గదర్శి.. ఇప్పటిదాకా ‘సర్క్యులర్‌’ వ్యాపారానికి అలవాటుపడ్డ వైనం

కొత్త చిట్లు వస్తే.. ఆ సొమ్మును పాత చిట్లకు చెల్లిస్తున్న సంస్థ.. సగానికి సగం ఖాళీ ఉన్న చిట్లలో... అన్నీ ఫోర్‌మెన్‌ పేరిటే

వాటికి తన తరఫున వాటా చెల్లించకుండానే కానిచ్చేస్తున్న తీరు.. డిసెంబరు నుంచి ఏపీలో కొత్త చిట్లే లేవు.. దీంతో నిధుల కొరత

అందుకే చిట్లు పాడుకున్నవారికి చెల్లింపుల్లో అంతులేని జాప్యం.. తాజా పరిస్థితుల్లో తమ కష్టార్జితం ఏమవుతుందోనని చిట్‌దారుల ఆందోళన

నిబంధనలు పాటిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదంటున్న అధికారులు.. నిధుల మళ్లింపు జరగకుంటే చిట్‌దారులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవి కాదు

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెరుకూరి రామోజీరావు (ఏ–1) కీలక ఆధారాలను మాయం చేసేందుకు విఫలయత్నం చేసినట్లు బహిర్గతమైంది. మార్గదర్శి బ్రాంచ్‌ కార్యాలయాల్లో కీలక ఆధారాలు, రికార్డులను గుట్టు చప్పుడు కాకుండా ధ్వంసం చేసినట్లు తాజాగా సీఐడీ అధికారులు గుర్తించారు.

ఈ తతంగాన్ని హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యా­లయం నుంచే పర్యవేక్షించారని, అందు­కోసం ఫోర్‌మెన్‌లతో ప్రత్యేకంగా జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు తేలింది. ఏ ఒక్కటీ ఆధారం దొరకకుండా రికార్డులు డిలీట్‌ చేయాలని మార్గదర్శి చిట్స్‌ బ్రాంచీల సిబ్బందిని ఆదేశించిన యాజమాన్యం జూమ్‌ మీటింగ్‌లో అర్థరాత్రి దాకా ఈ వ్యవ­హా­రాన్ని పర్యవేక్షించినట్లు వెలుగు చూసింది.

మరోవైపు గత డిసెంబర్‌ నుంచి రాష్ట్ర­వ్యాప్తంగా తమ లావాదేవీలు దాదాపు స్తంభించిపోవడంతో గొలుసుకట్టు తరహా మోసాలకు అలవాటుపడిన మార్గదర్శి యాజమాన్యం కొత్త చిట్టీలు లేకపోవడంతో దిక్కులు చూస్తోంది. పాడుకున్న చిట్టీల మొత్తం కోసం చందాదారులు మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. రశీదు రూపంలో డిపాజిట్లు చేసిన వారిలో ఆందోళన నెలకొంది. తమ వివరాలు ఏమవుతాయోనన్న ఆందోళన ఖాతాదారుల్లో నెలకొంది.

అడ్డదారిలో.. గుట్టుగా 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో తిమ్మిని బమ్మిని చేసేందుకు రామోజీరావు బరి తెగించారు. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు పెట్టినట్లు తేలడంతో కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు అడ్డదారులు పట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి కార్యాలయాల్లో కీలక ఆధారాలు, రికార్డులను ధ్వంసం చేయించారు.

దర్యాప్తులో ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయకూడదన్న నిబంధనను అతిక్రమించారు. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట రామోజీరావు అక్రమంగా రూ.2,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసినట్లు 2006లో బయటపడింది. నాడు రిజర్వు బ్యాంకు ఆదేశాలతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది.

దీంతో డిపాజిట్లు వసూలు చేయడం తమ తప్పిదమేనని రామోజీరావు అంగీకరించారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆయన హఠాత్తుగా మూసివేశారు. ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో కూడా అదే తరహాలో రికార్డులను నాశనం చేసే ప్రక్రియను గుట్టు చప్పుడు కాకుండా ముగించారు. 
 
అర్ధరాత్రి విధ్వంసం.. జూమ్‌లో పర్యవేక్షణ 
మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలను సీఐడీ అధికారులు విస్తృతం చేయడంతో బెంబేలెత్తిన రామోజీరావు తనకు అలవాటైన రీతిలో ఆధారాలను ధ్వంసం చేసేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం బ్రాంచి కార్యాలయాల మేనేజర్లతో (ఫోర్‌మెన్‌) మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యాజమాన్యం ప్రత్యేకంగా జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.

అక్రమ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో వారికి క్షుణ్నంగా వివరించారు. ఈ తతంగాన్ని హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించారు.

ప్రధాన కార్యాలయానికి మళ్లించిన చందాదారుల నగదు వివరాలు, భారీగా నిధుల తరలింపు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల వసూలు, పాట పాడిన చందాదారులకు చిట్టీ మొత్తం ఇవ్వకుండా కొంత మొత్తాన్ని అక్రమ డిపాజిట్‌గా అట్టిపెట్టడం, యాజమాన్య వాటా కింద అట్టిపెట్టిన చిట్టీల టికెట్లు, వాటిపై చందా చెల్లించకుండానే చెల్లించినట్టుగా మాయ చేయడం.. వీటన్నింటికి సంబంధించిన రికార్డులు, పత్రాలను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనూ ఎలా ధ్వంసం చేయాలో మార్గదర్శి ప్రధాన కార్యాలయ అధికారులు బ్రాంచి మేనేజర్లకు వివరించారు.

ఆధారాల ధ్వంసం ప్రక్రియను ప్రధాన కార్యాలయం నుంచే అర్ధరాత్రి వరకూ పర్యవేక్షించారు. సీఐడీ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాల్లో ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ధ్వంసం చేసిన ఆధారాలు, ఆన్‌లైన్‌ రికార్డులను సీఐడీ విభాగం రిట్రీవ్‌ చేసింది.
 
డిసెంబర్‌ నుంచి కొత్త చిట్టీలు లేవు 
మార్గదర్శి అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కొత్త చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి కార్యాలయాల్లో ఆర్థిక కార్యకలాపాలు 2022 డిసెంబర్‌ నుంచి దాదాపుగా స్తంభించిపోయాయి. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని చిట్‌ రిజిస్ట్రార్‌ స్పష్టం చేస్తుండగా రామోజీరావు ఆ చట్టాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో కొత్త చిట్టీలు ఆగిపోయాయి.

స్టాంపులు–రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల సోదాల్లో బయటపడిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మార్గదర్శి 37 బ్రాంచి కార్యాలయాల్లో రూ.273 కోట్ల వేలం టర్నోవర్‌తో 2,357 చిట్టీలను నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.6.29 కోట్లు వేలం టర్నోవర్‌ విలువ ఉన్న 148 కొత్త చిట్టీలను ప్రారంభిస్తారు. వాటిపై మార్గదర్శి యాజమాన్యానికి కమీషన్‌ రూపంలోనే రూ.31.45 లక్షల వస్తాయి. డిసెంబర్‌ నుంచి చందాదారులు ముందుకు రాకపోవడంతో ఏకంగా 1,200కుపైగా కొత్త చిట్టీలు ప్రారంభం కాలేదు. రూ.51 కోట్ల వేలం టర్నోవర్‌ ఉన్న చిట్టీలు నిలిచిపోయాయి.

ఆ మొత్తాన్ని మ్యూచ్‌వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్‌లతోపాటు తమ సొంత సంస్థల్లో పెట్టుబడిగా మళ్లించేందుకు సాధ్యం కావడం లేదు. ఇక కమీషన్‌ రూపంలో రూ.2.55 కోట్ల మేర మార్గదర్శి యాజమాన్యానికి రాకుండా పోయింది. కొత్త చిట్టీల కోసం చందాదారులను రప్పించేందుకు బ్రాంచి మేనేజర్ల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 

చందాదారుల ప్రదక్షిణలు... డిపాజిట్‌దారుల్లో ఆందోళన 
గతేడాది డిసెంబర్‌ నుంచి కొత్త చిట్టీలు ప్రారంభం కాకపోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మనీ సర్క్యులేషన్‌ నిలిచిపోయింది. పాత చిట్టీల చందాదారులు చెల్లించిన మొత్తాన్ని రామోజీరావు అక్రమంగా తమ సొంత సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేశారు. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లను మ్యూచ్‌వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టారు. కొత్త చిట్టీలు ప్రారంభమైతే ఆ చందాదారులు చెల్లించే మొత్తాన్ని పాత చిట్టీలు పాడిన వారికి చెల్లిస్తుంటారు.

గడువు తీరిన అక్రమ డిపాజిట్ల విత్‌డ్రాయల్స్‌ మొత్తంగా చెల్లించడం, వడ్డీలు చెల్లించడం మొదలైన వ్యవహారాలు నిర్వహించేవారు. ప్రతి చిట్టీలోనూ యాజమాన్యం వాటా కింద అట్టిపెట్టుకున్న టికెట్ల చందా మొత్తాన్ని కూడా అవే నిధుల్లో చెల్లించినట్టు రికార్డుల్లో మాయ చేసేవారు. ఈ గొలుసు కట్టు తరహా మోసాన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త చిట్టీలు లేనందున మార్గదర్శి లావాదేవీలు నిలిచిపోయాయి. పాత చిట్టీలు పాడిన చందాదారులకు సకాలంలో చెల్లించడం లేదు.

తాము ష్యూరిటీ సంతకాలన్నీ చేయించినా చిట్టీ మొత్తం చెల్లించకపోవడంతో చందాదారులు ఆందోళన చెందుతున్నారు. మార్గదర్శి కార్యాలయాల చుట్టూ మండుటెండల్లో ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్నంలోని సీతంపేట, గుంటూరు అరండల్‌పేట బ్రాంచి కార్యాలయాలకు వచ్చి రిక్త హస్తాలతో వెనుదిరుగుతున్నారు. దీనిపై కొందరు చిట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు కూడా చేస్తుండటం గమనార్హం. మరోవైపు గతంలో చిట్టీలు పాడిన మొత్తాన్ని వారికి చెల్లించకుండా రశీదు ఇచ్చి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు.

మార్గదర్శి అక్రమాలు బయటపడటంతో ఆ డిపాజిట్‌దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, వడ్డీ లేకపోయినా అసలైనా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్రాంచి కార్యాలయాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వారిలో ఆందోళన తీవ్రమవుతోంది. కొందరు సీఐడీ అధికారులను కూడా సంప్రదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను నమ్మి తమ కష్టార్జితాన్ని ధారపోసి నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నిబంధనలు పాటిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ప్రతి చిట్‌కూ ఓ బ్యాంకు ఖాతా ఉంటే జాప్యానికి ఆస్కారమే ఉండదని, నిధుల మళ్లింపు జరగకుంటే చిట్‌దారులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవి కావని అధికారులు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు