‘అసైన్డ్‌ స్కామ్‌’పై సీఐడీ దూకుడు

28 Mar, 2021 03:19 IST|Sakshi
తుళ్లూరు మండలం మల్కాపురంలో సీఐడీ విచారణ సందర్భంగా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతులు

రంగంలోకి ఐదు బృందాలు

50 మంది రైతులను విచారించిన అధికారులు

టీడీపీ నేతలు భయపెట్టి భూములు లాక్కున్నారు.. మోసం చేశారు

సీఐడీ ముందు రైతుల ఆవేదన

సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలకు రాజధానిగా మారిన అమరావతిలో అసైన్డ్‌ భూస్కామ్‌పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన సీఐడీ భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా రైతులను కలిసి వారి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన 50 మంది అసైన్డ్‌ భూములు రైతులను మందడం గ్రామానికి పిలిచిన సీఐడీ ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో వారిని విచారించాయి. రెండు రోజుల క్రితం తాళ్లాయపాలెం, రాయపూడి గ్రామాల రైతులను తుళ్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే.

భయపెట్టి భూములు గుంజుకున్నారు..
తాజాగా సీఐడీ బృందాల విచారణలో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారులు ముందు ఏకరువు పెట్టారని తెలుస్తోంది. టీడీపీ నేతలు తమను భయపెట్టి అయినకాడికి తమ భూములను గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదంటూ ఆందోళనకు గురిచేసి.. అతి తక్కువ ధరకే తమ భూములను అమ్ముకునేలా చేశారని రైతులు వాపోయారు. ఇలా తమ భూములను కొల్లగొట్టిన టీడీపీ నేతలు వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుని.. తమను నిలువెల్లా మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా భూములను అమ్మడానికి ఇష్టపడని రైతులను అనేక విధాలుగా బెదిరించి, భయపెట్టారని సీఐడీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. 

బినామీల పేర్లతో అమ్మలేదనే అక్కసుతో..
మల్కాపురంలో ఉద్ధంరాయునిపాలెం సొసైటీకి చెందిన ఆరుగురు రైతులను సీఐడీ విచారించింది. తాము భూములు పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేశారని రైతులు తెలిపారు. ఈ అంశంపై అప్పటి కలెక్టర్‌తోపాటు, సీఆర్‌డీఏ అధికారులు, ఎస్సీ కమిషన్‌ చైర్మన్, నాటి సీఎం చంద్రబాబును సైతం కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోర్టుకు వెళ్లి తమ భూములను పూలింగ్‌కు తీసుకోవాలని కోరగా, కలెక్టర్‌ను కలవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో కలెక్టర్‌ను కలిసినా ఆయన ఉద్దేశపూర్వకంగా మాట దాటవేయడంతో తాము పూలింగ్‌కు ఇవ్వలేకపోయామన్నారు. బినామీ పేర్లతో అమ్మలేదనే అక్కసుతోనే తమ భూములను పూలింగ్‌కు తీసుకోలేదని రైతులు విమర్శించారు. తమ పేర్ల మీద భూములు ఉన్నా.. వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి ఇతరుల పేర్లపై నమోదు చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఆధారాలే నిదర్శనమన్నారు. కోర్టును ఆశ్రయించడంతో తిరిగి రికార్డుల్లో ప్రభుత్వ భూములనే పేర్లు తొలగించి తమ పేర్లను నమోదు చేశారని వివరించారు. అక్రమంగా భూములు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో రికార్డుల ట్యాంపరింగ్‌కు యత్నించారని రైతులు వాపోయారు. రైతులతోపాటు స్థానికులు కూడా దీనిపై సీఐడీ అధికారులకు పలు ఫిర్యాదులు చేశారు. 

తప్పించుకోవడానికి టీడీపీ నేతల ప్రయత్నాలు..
కాగా, అసైన్డ్‌ భూముల కుంభకోణంలో బలమైన ఆధారాలు కనిపిస్తుండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండే కొందరిని తెర మీదకు తెచ్చారు. రైతుల పేరుతో వారిని సీఐడీ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారుల దగ్గరకు పంపించి అసైన్డ్‌ భూములను తాము ఇష్టపూర్వకంగానే ఇచ్చామని, గత టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకుందని చెప్పే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అసైన్డ్‌ భూముల కుంభకోణంపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రభుత్వ పాపాలు బట్టబయలవుతాయని అమరావతి ప్రాంతానికి చెందిన దగా పడ్డా దళిత రైతులు చెబుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు