కదులుతున్న అక్రమాల డొంక..

24 Aug, 2020 11:03 IST|Sakshi
ఎర్రగుంట్ల: ఆప్కో మాజీ చైర్మన్‌ గుజ్జల శ్రీనివాసులు బంధువుల ఇంటిలో రికార్డులు పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

బోగస్‌ సొసైటీలపై సీఐడీ దృష్టి

లావాదేవీలపై ప్రత్యేక నిఘా

తనిఖీల్లో రికార్డులు స్వాధీనం

జిల్లాలో కొనసాగుతున్న సోదాలు 

సాక్షి కడప: తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆప్కోలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బినామీ సొసైటీలను అడ్డుపెట్టుకుని ఆప్కో మాజీ చైర్మన్‌ శ్రీనివాసులు చేసిన అవినీతిని సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే గుజ్జుల శ్రీను ఇంటిలో సోదాలు జరిపి 9కిలోలకు పైగా బంగారం, 16కేజీల వెండి, రూ.కోటి 10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రొద్దుటూరు, ఖాజీపేట, కడప, ఎర్రగుంట్లలో దాడులు చేశారు. రికార్డులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

70శాతం బోగస్‌ సొసైటీలే.. 
సీఐడీ అధికారులు జిల్లాలోని 126 చేనేత సొసైటీలను గుర్తించారు. 2015 నుంచి 2018 వరకూ అధిక లావాదేవీలు జరిగిన వాటిని ప్రత్యేకంగా గుర్తించారు. ఆ సోసైటీల సభ్యుల జాబితాను తీసుకున్నారు. గ్రామాలకు వెళ్లారు. సొసైటీల్లో నిజంగా సభ్యులు ఉన్నారా కాగితాలకే పరిమితమయ్యారా అనే విషయాలపై ఆరా తీశారు.దాదాపు 70శాతం బోగస్‌ సొసైటీలను గుర్తించారు. ఇందులో అధిక భాగం ఆప్కో మాజీ చైర్మన్‌ బినామీలున్నట్లు గుర్తించింది. సొసైటీల ఆర్థిక లావాదేవీలపై సీఐడీ ప్రత్యేక నిఘా ఉంచింది. బోగస్‌ సోసైటీలుగా ఉండి ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారనే దానిపై విచారణ చేస్తున్నారు. అందులో కీలక పాత్ర ఎవరిది.. సహకరించినవారెవరు.. అధికారులు పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కడప కేంద్ర కార్యాలయంలోని రికార్డులను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.  

పవర్‌లూమ్‌ నుంచి రూ. కోట్లు స్వాహా
పవర్‌లూమ్‌ నుంచి మీటరు రూ. 30 నుంచి రూ 35కే లభిస్తుంది. సిరిసిల్లా, సూరత్, ఈరోడ్, ప్రొద్దుటూరులోని పవర్‌లూమ్‌పై నేసిన క్లాత్‌ను ఆప్కో మాజీ చైర్మన్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేతలు నేసినట్లు రికార్డులు తయారు చేయించారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా చేయడం వల్ల మీటరుకు రూ.100 నుంచి రూ.110 మిగులు తుంది. ఇలా కోటి మీటర్లు ఆప్కోకు అమ్మితే రూ.110 కోట్లు మిగిలుతుంది. ఇలా వచ్చిన డబ్బు అంతా స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోందనే దానిపై ఆరాతీస్తున్నారు.

పవర్‌లూమ్‌ నుంచి తెచ్చిన క్లాత్‌ను నేరుగా ఆప్కో షోరూమ్‌ గోడౌన్‌కు తరలించడం ద్వారా ట్రాన్స్‌పోర్టు పేరుతో రూ. కోట్లు స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
ఆర్థికంగా నష్టపోయిన సొసైటీలకు ఎన్‌సీడీసీ పేరుతో నిధులు ఇచ్చి ఆదుకుంటారు. ప్రభుత్వం నుంచి 30శాతం సబ్సిడీ వస్తుంది. రుణాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుంది.బోగస్‌ సోసైటీలు నిధులు తీసుకుని సబ్సిడీలు పొంది ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టిన విషయంపై విచారణ చేస్తున్నారు. 
విద్యార్థులకు దుస్తులు కుట్టించే విషయంలోనూ అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.చేనేత కార్మికులు నేసిన క్లాత్‌ను దుస్తులు కుట్టడానికి ఇవాల్సి ఉంటుంది. కానీ అప్పటి ఆప్కో చైర్మన్‌ ఆధ్వర్యంలో పవర్‌లూమ్‌ మగ్గంపై నేసిన క్లాత్‌ను తెప్పించి సరఫరా చేసినట్లు గుర్తించారు. విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం జతకు రూ 50 అందిస్తోంది. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా రూ 30కు కుట్టించి మిగతా సొమ్ము స్వాహా చేశారు. సుమారు రూ. వందల కోట్లు స్వాహా జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
చేనేత సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఆర్‌ఆర్, కార్పస్‌ ఫండ్‌ను ఇస్తాయి. ఇలా వచ్చిన ఫండ్‌ ఆప్కో మాజీ చైర్మన్‌ ద్వారా బినామీ సొసైటీలకు అందినట్లు గుర్తించారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై  పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఆప్కో మాజీ చైర్మన్‌ గోడౌన్‌పై దాడులు
ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్‌ గుజ్జల శ్రీనివాసులు గోడౌన్‌పై సీఐడీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గోడోన్‌లో ఉన్న క్లాత్‌ను పరిశీలించారు. వాటిని సీజ్‌ చేశారు.


   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా