‘స్కిల్డ్‌’ క్రిమినల్‌ చంద్రబాబు

13 Jan, 2024 05:12 IST|Sakshi

కమీషన్లు పోనూ షెల్‌ కంపెనీల ద్వారా బాబు నివాసానికి రూ.241 కోట్లు

హవాలా అక్రమాలను నిర్థారించిన ఈడీ, కాగ్‌ 

ఏ–1 చంద్రబాబు పాత్రను  ఆధారాలతో సహా రుజువు చేసిన సీఐడీ 

ఖైదీగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో 52 రోజులు బాబు

సాక్షి, అమరావతి:  టీడీపీ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం చంద్రబాబు అంతులేని అక్రమాలకు ఓ మచ్చు తునక మాత్రమే. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట చంద్రబాబు సాగించిన బాగోతం చూసి యావత్‌ దేశం అవాక్కయ్యింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో కాగితాలపై ప్రాజెక్టు సృష్టించారు. రూ.370 కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. సీమెన్స్‌ పేరుతో జీవో జారీ చేసి తన బినామీ కంపెనీ డిజైన్‌టెక్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతర్‌ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రూ.271 కోట్లు విడుదల చేసి షెల్‌ కంపెనీల ద్వారా అక్రమార్జనను తన నివాసానికే చేరవేశారు.

ఈ అవినీతి నెట్‌వర్క్‌ గుట్టును సీఐడీ ఛేదించడంతో చంద్రబాబు అక్రమాలు బట్టబయలయ్యాయి. స్కిల్‌ స్కామ్‌ సృష్టికర్త చంద్రబాబేనని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో ఆధారాలతో సహా వెల్లడైంది. దీంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షిట్‌ నమోదు చేసింది. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2­గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్‌ కేసు నమోదు చేసింది. గతేడాది సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్ట్‌ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది.

చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఖైదీ నంబర్‌ 7691­గా చంద్రబాబు 52 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన తరువాత అనారోగ్య కారణా­లతో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబు సాగించిన స్కిల్‌ స్కామ్‌ ఇలా సాగింది.. 

విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ 
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన సంజయ్‌ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్‌ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు.

భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌ కని్వల్కర్‌ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్‌ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. కనీసం కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశారు. అనంతరం సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. 

అంతా బాబు ముఠానే.. 
ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె.లక్ష్మీ­నారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా  సుబ్బారావుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో పోస్టుతో­పాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ – ఇన్నోవేటివ్‌ కార్పొరేషన్‌ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా 4 పోస్టులు కట్టబెట్టారు. నేరుగా నిధులు మంజూరు జరిగేలా కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్‌ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌భాస్కర్‌ సతీమణి, యూపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అపర్ణను ఏపీ­ఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు.  

రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు..
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు.  

ఎయిడ్‌ లేదు.. కైండ్‌ అంత కంటే లేదు 
సీమెన్స్‌కి తెలియకుండా సుమన్‌ బోస్‌ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్‌వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90% కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు.  అంటే  గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ లేదు! గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌ అంత కంటే లేదు!  గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. టెండర్లు లేకుండా తన బినామీ కంపెనీకి ప్రాజెక్ట్‌ కట్టబెట్టేందుకే ఈ ఎత్తుగడ వేశారు. 

నో రూల్స్‌...  
సీమెన్స్‌– డిజైన్‌ టెక్‌ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక  కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్‌ఎస్‌డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్‌ నోట్‌ ఫైల్‌లో పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కూడా నిధులు విడుదల నిబంధనలకు విరుద్ధమని వారించినా చంద్రబాబు లెక్క చేయలేదు.

గంటా సుబ్బారావు చెప్పినట్లు నిధులు విడుదల చేయాలని ఐవైఆర్‌ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్‌ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్‌ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్‌ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు పీవీ రమేశ్‌ తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు.  

13 చోట్ల చంద్రబాబు సంతకాలు  
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్‌ డెవలప్మెంట్‌–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్‌ ఫైళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు.  

షెల్‌ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు  
డిజైన్‌ టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబు బంగ్లాకు రూ.241 కోట్లు చేరవేశారు.

కేసులో కీలక నిందితులు
ఏ–1 చంద్రబాబు, నాటి ముఖ్యమంత్రి 
ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, నాటి కార్మిక శాఖ మంత్రి 
ఏ–3 గంటా సుబ్బారావు, నాటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో 
ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్‌ ఐఏఎస్, నాటి ఏపీఎస్‌ఎస్‌డీసీ సలహాదారు 
ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ 
ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, నాటి ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవో 
ఏ–7 ప్రతాప్‌ కుమార్, నాటి ఫైనాన్షియల్‌ ఆఫీసర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ  
ఏ–8 సుమన్‌ బోస్, సీమెన్స్‌ ఇండియా మాజీ ఎండీ 
ఏ–9 జీవీఎస్‌ భాస్కర్‌ ప్రసాద్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ హెడ్‌ 
ఏ–10 వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్, డిజైన్‌టెక్‌ ఎండీ

ప్రాజెక్ట్‌ గురించి తెలియదన్న సీమెన్స్‌ 
సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్‌ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్‌ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్‌ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు  వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్‌ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్‌ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు.

మదింపు బూటకం.. నివేదిక నాటకం 
ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు సరైందేనంటూ ‘సెంటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) థర్డ్‌ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వాదించి అడ్డంగా దొరికిపోయారు. తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని, కేవలం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేసింది. వాస్తవానికి అంతకంటే ముందే డిజైన్‌ టెక్‌కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది.

కొరడా ఝుళిపించిన ఈడీ 
ఈ స్కామ్‌పై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతా­ల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయి? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు ఇప్పటికే నిర్ధారించింది.

నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం
టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా నాడు ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు.

బాబు అవినీతి నెట్‌వర్క్‌ ఇదిగో..
టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది.  డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.  పీవీఎస్‌పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్‌ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...

ఏసీఐ: రూ.56 కోట్లు
నాలెడ్జ్‌ పోడియమ్‌: రూ.45.28 కోట్లు 
ఈటా: రూ.14.1 కోట్లు 
పాట్రిక్స్‌: రూ.3.13 కోట్లు 
ఐటీ స్మిత్‌: రూ.3.13 కోట్లు 
భారతీయ గ్లోబల్‌: రూ.3.13 కోట్లు 
ఇన్‌వెబ్‌: రూ.1.56 కోట్లు 
పోలారీస్‌: రూ.2.2 కోట్లు 
కాడెన్స్‌ పార్టనర్స్‌: రూ.12 కోట్లు

♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్‌ గుప్తా డ్రా చేసి షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందించారు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  
♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేర్చారు.  
♦  ఏపీఎస్‌ఎస్‌డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. 
♦   అమెరికాకు శ్రీనివాస్‌... దుబాయ్‌కి మనోజ్‌  అక్రమ నిధులను తరలించిన పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ అమెరికాకు, మనోజ్‌ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు.  

>
మరిన్ని వార్తలు