రాజమండ్రి ఎంపీగా జమున రాజకీయ ప్రస్థానం

28 Jan, 2023 16:07 IST|Sakshi

సీటీఆర్‌ఐ(రాజమ హేంద్రవరం)/అమలాపు రం టౌన్‌/సామర్లకోట/కొవ్వూరు: గోదారీ గట్టుంది.. గట్టుమీన సెట్టుంది.. సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది..ఈ పాట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది గలగల పారే గోదావరి మాత్రమే కాదు..అమాయకత్వాన్ని..అందాన్ని..అభినయాన్ని మూటగట్టుకున్న అలనాటి సినీనటి జమున..గోదావరిని..ఆ నదీమతల్లి పేరును తెరకు బలంగా పరిచయం చేసిన ఆమె మూగ మగమనసులు ఎప్పటికీ చిరస్మరణీయం ..రాజమహేంద్రవరానికి చెందిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తాను అమితంగా ప్రేమించే గోదావరిని 1964లో ఈ చిత్రం ద్వారా తెరకెక్కించారు. గోదారి గట్టుంది పాటకు తన అభినయంతో జమున ప్రాణం పోశారు. శుక్రవారం ఉదయం జమున కన్నుమూశారని తెలియగానే జిల్లా ప్రజానీకం కంటతడి పెట్టింది. ఈ అందాల తారతో తమ గోదారి ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంది. చాలామంది ఈమెను గోదావరి జిల్లా వాసిగా భావిస్తారు. కర్నాటక హంపీలో పుట్టినా ఈమె మన జిల్లాతో మమతానురాగాలను పెనవేసుకున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు కూడా ఆమెను తమ ఆడపడుచుగా ఆదరించారు. 

గలగల పారుతున్న గోదారిలా.. 
1953లో జమున  పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేసినా అంత గుర్తింపు రాలేదు. 1964లో ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించిన మూగమనసులు చిత్రంలో ఈమె గౌరమ్మ పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారా జమున ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. అదే సినీమా హిందీలో మిలన్‌గా రీమేక్‌ చేస్తే అందులో కూడా నటించి మెప్పించారు. ఉత్తమ సహాయనటిగా ఫిల్మిఫేర్‌ అవార్డు అందుకున్నారు. సఖినేటిపల్లి–నర్సాపురం మధ్య వశిష్ట గోదావరి గట్ల పైన..పడవలపైన ఈమెతో తీసిన ‘గోదారి గట్టుంది.. పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘నా పాట నీ నోట పలకాలా చిలకా’ పాట కూడా గోదావరి అందాల బ్యాక్‌ డ్రాప్‌లోనే చిత్రీకరించారు. గోదావరికీ జమునకు విడదీయరాని బంధముందేమో. 1974లో చిత్రీకరించిన గౌరి సిమిమాలో  ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటలో కృష్ణతో ఇక్కడి గోదావరి పాయల్లోనే నర్తించారు. 2014లో జరిగిన గోదావరి పుష్కరాలకు ఆమె పనిగట్టుకుని మరీ వచ్చారు.‘గోదారి గట్టుంది’ పాట తాను జీవించి ఉన్నంత కాలం గుర్తుంటుందని చెప్పడం విశేషం 

పెద్ద మనసున్న నటి 
1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనతో కనివీని ఎరుగని నష్టం వాటిల్లింది. ఆ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఎనీ్టఆర్, ఏఎన్‌ఆర్‌ వంటి అగ్రతారలతో కలిసి జమున జోలె పట్టి చందాలు వసూలు చేశారు. ఇక్కడి ప్రజలు తమ ఆడపడుచు వచ్చినట్లుగా భావించి స్పందించారు. వంద రూపాయలిస్తే షేక్‌హ్యాండ్‌ ఇస్తానని సరదాగా అనడంతో అభిమానులు ఎగబడి ఆమెకు కరచాలనం చేసి విరివిగా విరాళాలు అందజేశారు.  

రాజమండ్రి ఎంపీగా.. 
 ఇందిరాగాంధీ మీద ఉన్న అభిమానంతో జమున రాజకీయాలలో అడుగుపెట్టారు. తనను సినీరంగంలో ఆదరించిన రాజమండ్రి నుంచి 1989లో పోటీ చేశారు. లోక్‌సభ సభ్యురాలిగా 1991 వరకూ కొనసాగారు. తెలుగు ఆర్టిస్ట్ ల అసోసియేషన్‌ను  ప్రారంభించారు. రంగ స్థల వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తరుణంలో సామర్లకోట మండలం మాధవపట్నం శివారున ఉన్న తోలుబొమ్మ కళాకారుల జీవన పరిస్థితులు చూసి చలించిపోయారు. అప్పటి కలెక్టర్‌తో వారి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు. గ్రామ సమీపంలో సుమారు 10 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి మూడేసి సెంట్లు వంతున 176 మంది కళాకారులకు ఇళ్ల స్థలాలుగా అందజేశారు. ఎంపీగా ఉన్నప్పుడు తమ వద్దకు వచ్చి యోగ క్షేమాలు అడిగే వారని ఈ కళాకారుల సంఘ నాయకులు తోట బాలకృష్ణ, తోట గణపతి, రాష్ట్ర బొందిలిల కార్పోరేషన్‌ డైరెక్టర్‌ తోట సత్తిబాబులు గుర్తు చేసుకున్నారు. అందుకే మాధవపట్నం శివారు ప్రాంతాన్ని జమునానగర్‌గా వ్యవహరిస్తున్నారు.  

ఎంపీ హోదాలో జమున రాజమహేంద్రవరంలో 1991 ఏప్రిల్‌ 5న ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొవ్వూరు మండలం నందమూరులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన వైనాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.  

 1989లో కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రఫీయుల్లా బేగ్‌ తరఫున జమున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాపవరంలో రఫీ మోటారు బైకు ఎక్కి ఆమె ప్రధాన వీధుల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు.  

రాజమహేంద్రి ఆడపడుచు జమున: ఎంపీ భరత్‌ 
రాజమహేంద్రవరం రూరల్‌: జమున మృతికి వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె నటన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమేనన్నారు. అగ్ర కథానాయకుల చెంత దీటుగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సత్యభామ పాత్రలో ఆమె జీవించారన్నారు. 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకున్నారన్నారు. రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించి ఈ ప్రాంత ఆడపడుచుగా పేరొందారని నివాళులరి్పంచారు.  

జెట్‌ మిత్ర రండి... 
జమున రాజమహేంద్రవరం నగరానికి ఎప్పుడు వచ్చినా జెట్‌ మిత్ర రండి అని నన్ను పిలిచేవారు. మేడమే నా పేరు జిత్‌ మోహన్‌ మిత్ర అని చెబితే మీరు పిలవగానే జెట్‌ స్పీడ్‌తో వస్తారు కదా ..అందుకే జెట్‌ మిత్ర అని పిలుస్తున్నాను అనేవారు. అమె ఎంపీగా పోటీ చేసినప్పుడు అమె దగ్గర ఉండి తోడ్పాటు అందించాను.  పెద్ద తార అయినప్పటికీ భేషజం చూపించేవారు కాదు.  
  – శ్రీపాద జిత్‌మోహన్‌మిత్ర, సినీయర్‌ నటుడు 

ఆమె ఆత్మకు శాంతి కలగాలి... 
2016  శ్రీమహాలక్ష్మీ సమేత చినవేంకటేశ్వర స్వామి పీఠం బ్రహ్మోత్సవాలలో సర్వేజనా సుఖినోభవంతు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జమునకు కళాతపస్విని అనే బిరుదును ప్రదానం చేశాం. రాజమహేంద్రవరం ఆడపడుచుగా ఆమెను సత్కరించుకున్నాం. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 
– డాక్టర్‌ శ్రీమాన్‌ చిన్న వెంకన్నబాబు స్వామిజీ  

>
మరిన్ని వార్తలు