సినిమాకు మంచి రోజులు

11 Feb, 2022 03:13 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సినీ రంగ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, ఆర్‌. నారాయణమూర్తి, కొరటాల శివ, అలీ, పోసాని కృష్ణమురళి

ధరల సవరణ ప్రతిపాదనలపై పరిశ్రమ ప్రతినిధుల సంతోషం 

ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు ఉభయతారకంగా సీఎం నిర్ణయం  

చిన్న, పెద్ద ఏ సినిమా టికెట్‌కైనా ఒకటే రేటుండాలని స్పష్టీకరణ 

రూ.100 కోట్ల బడ్జెట్‌ దాటిన వాటికి వారంపాటు ప్రత్యేక ధర 

ఆ బడ్జెట్లో హీరో, హీరోయిన్, దర్శకుడి రెమ్యూనరేషన్‌ మినహాయింపు 

తగిన నిబంధనలతో చిన్న సినిమాకు న్యాయం చేస్తామని హామీ 

ఈ నిర్ణయాలన్నిటిపై నెలాఖర్లోగా ఉత్తర్వులు వెలువడే అవకాశం 

విశాఖను సినీ పరిశ్రమ తమదిగా భావించాలని కోరిన ముఖ్యమంత్రి 

ఆ దిశగా ముందడుగేస్తే ఇళ్లకు, స్టూడియోలకు స్థలాలిస్తామని వెల్లడి  

సాక్షి, అమరావతి: తెలుగు సినిమాకు నిజంగా మంచి రోజులొచ్చాయి. ఇటు ప్రేక్షకులకు అందుబాటు ధరలో వినోదాన్ని దగ్గర చేయడంతో పాటు అటు సినీ రంగం అభివృద్ధికి సీఎం జగన్‌ కొత్త బాటలు వేసే దిశగా అడుగులు ముందుకు వేశారు. సినీ రంగం ఆందోళనకు తెరదించారు. సినిమాలన్నింటికీ ఒకే టికెట్‌ ధరను అమలు చేయడంతో పాటు చిన్న సినిమాలకు ప్రాణం పోసే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సినీ రంగం వేళ్లూనుకునేలా కీలక ఆఫర్‌ను సినీ ప్రముఖుల ముందు ఉంచారు. విశాఖను సినీ మణిహారంగా తీర్చిదిద్ది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే ఊత కర్రగా నిలిచారు.

వెరసి తామంతా కష్టకాలం నుంచి బయట పడినట్లేనని సినీప్రముఖులు హాయిగా ఊపిరి పీల్చుకున్న ఆహ్లాదకర, అరుదైన సన్నివేశం గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కనిపించింది. సినీ రంగానికి సంబంధించి కొద్ది రోజులుగా నలుగుతున్న సమస్యలపై గురువారం సినీ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. తన ప్రతిపాదనలను సీఎం వారి ముందు ఉంచారు. చిన్న, పెద్ద సినిమాలనే వ్యత్యాసాలను, ఒకరి సినిమాకు ఎక్కువ రేటు.. ఇంకొకరి నినిమాకు తక్కువ రేటు అనే వివక్షకు తావు లేకుండా ఒకే టికెట్‌ ధర ఉండాలన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్‌ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్‌ చేయాలన్నారు. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేసే వెసులుబాటు ఉండాలని చెప్పారు.

ఈ ప్రతిపాదనలను సినీ ప్రముఖులు ఆహ్వానించారు. భేటీకి ముందు.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్‌ ధరల ఖారారుపై సీఎం భారీ కసరత్తు చేశారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తీసుకుని పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నారు. సినీ ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్కడికక్కడే సీఎం కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకే టికెట్‌ ధరకు ఐదో షోకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

సీనీప్రముఖుల అభిప్రాయం మేరకే ఏ సినిమాౖకైనా, ఎవ్వరి సినిమాకైనా ఒకే టికెట్‌ ధర ఉండాలన్నారు. పండుగలకు చిన్న సినిమాల విడుదలకు కూడా అవకాశాలు కల్పించాలని సినీ ప్రముఖులను సీఎం కోరారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు రావాలని, స్డూడియోల ఏర్పాటుకు, ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈ నిర్ణయాలపై సీఎంతో సమావేశం సందర్భంగా, విలేకరుల సమావేశంలో సినీ ప్రముఖులందరూ సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ మొత్తాన్ని, సినీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. సినిమా టికెట్‌ ధరలతో పాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి ఈ నెలలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.  

మరిన్ని వార్తలు