సినీ హీరోలు సీఎం కావడం కష్టమే.. 

3 Mar, 2021 04:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: సినిమా హీరోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు కావడం కష్టమేనని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం విజయవాడ వచ్చిన సుమన్‌ ‘సాక్షి’తో మాట్లాడారు. సినిమాల ద్వారా అన్ని వర్గాలను మెప్పించిన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలు రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితులు.. ఇప్పుడు లేవని చెప్పారు. వారికి రాజకీయాల్లో అందరి ఆమోదం లభించిందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని రాజకీయ పార్టీ పెడితే ప్రజల ఆదరణ పొందడం అంత తేలికైన విషయం కాదన్నారు. ఎంత గొప్ప హీరో అయినా కులమతాలకు అతీతంగా ప్రేక్షకులను మెప్పించగలడు కానీ.. రాజకీయాల్లో ప్రజలను సంతృప్తి పర్చడం కష్టతరమన్నారు.

రాజకీయ నేతల పట్ల ప్రజల్లో అంచనాలు పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు. ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వారిని సంతృప్తి పర్చడం కత్తి మీద సాము వంటిదేనని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు లంచాలు ఇవ్వకుండా సేవలు పొందేలా పాలన ఉండాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన అరకొర సొమ్ము.. లంచాలకు పోతే వారి బతుకు కష్టంగా మారుతుందన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి గొప్ప అని చెప్పారు. మన మతం కోసం.. ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీసే విధానాలకు తాను దూరంగా ఉంటానన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు పక్కపక్కనే వారి వారి మత విశ్వాసాల ప్రకారం దేవుడిని ప్రార్థించే గొప్ప ఆదర్శం మన దేశంలోనే ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. మన ఆదర్శాలను భావితరాలకు పదిలంగా అందించాల్సిన అవసరముందన్నారు. కొందరు స్వార్థం కోసం అన్నదమ్ముల్లా మెలగాల్సిన ప్రజల మనస్సుల్లో కుల, మత, ప్రాంతీయ వైషమ్యాల బీజాలు నాటడం సరికాదని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు