మహిళ విషయంలో గొడవ.. హోటల్‌ నిర్వాహకుడిని చితకొట్టిన సీఐ

2 Aug, 2021 16:21 IST|Sakshi

సాక్షి, గుత్తి (అనంతపురం): గుత్తి సీఐ రాము రెచ్చిపోయారు. అకారణంగా ఓ హోటల్‌ నిర్వాహకుడిని దుర్భాషలాడడమే కాకుండా విచక్షణరహితంగా చితకబాదారు. ఈ ఘటనతో గుత్తిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్‌ఎస్‌ రోడ్డులో లోకేష్‌ అనే వ్యక్తి డార్లింగ్‌ కేఫ్‌  (హోటల్‌) నిర్వహిస్తున్నాడు. ఆదివారం కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన కొందరు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో హోటల్‌లో ఓ మహిళ విషయంగా వారు గొడవపడ్డారు. అదే సమయంలో సీఐ రాము, కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. అక్కడ జరుగుతున్న గొడవను గమనించి సీఐ రాము వెంటనే వాహనాన్ని ఆపి గొడవ పడుతున్న వారిని చెదరగొట్టారు.  

విచక్షణారహిత దాడి.. 
ఈ క్రమంలోనే కేఫ్‌ నిర్వాహకుడు లోకేష్‌పై సీఐ రాము అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీతో చితకబాదడంతో తొడలపై, కాలి పిక్కలపై, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్‌ దెబ్బలకు లోకేష్‌ నడవలేని స్థితిలో ఉన్న చోటునే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న లోకేష్‌ కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే కేఫ్‌ వద్దకు చేరుకున్నారు.  

జడ్జి దృష్టికి దురాగతం.. 
లోకేష్‌ పరిస్థితిని చూసిన కుటుంబసభ్యులు చలించిపోయారు. ఇందుకు కారకుడైన సీఐ రాముకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేఫ్‌ ఎదురుగా ఉన్న రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకుని ధర్నాకు దిగారు. అనంతరం క్షతగాత్రుడిని తీసుకుని జడ్జి బంగ్లా వద్దకు చేరుకుని న్యాయమూర్తి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. నడవలేని స్థితిలో చతికిలబడిన లోకేష్‌కు వెంటనే చికిత్స అందజేయాలంటూ స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారికి న్యాయమూర్తి ఫోన్‌ చేసి ఆదేశించారు. ప్రాథమిక చికిత్స  అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారి సూచించారు.  

బాధితులతో పోలీసుల వాగ్వాదం.. 
ఆస్పత్రి నుంచి అనంతపురానికి తరలిస్తూ మార్గమధ్యంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ వద్ద కాసేపు ధర్నా చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బాధితుడి బంధువులకు, కానిస్టేబుళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్‌ పరిస్థితి విషమిస్తుండడంతో క్షతగాత్రుడిని తీసుకుని కుటుంబసభ్యులు అనంతపురానికి ఆగమేఘాలపై తరలిపోయారు. ఈ సందర్భంగా విలేకరులతో బాథితుడు లోకేష్‌ మాట్లాడుతూ... తనను అకారణంగా సీఐ రాము దుర్భాషలాడుతూ శరీరమంతా చితక బాదాడని ఆవేదన వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు