రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం

4 Dec, 2022 05:08 IST|Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనమలూరు/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఆమె రాష్ట్ర పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 

గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అధికారిక విందు ఏర్పాటు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. 

రాష్ట్రపతి పర్యటన ఇలా..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.  గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు.

అనంతరం అక్కడి నుంచి ద్రౌపది ముర్ము రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ ఇచ్చిన అధికారిక విందులో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంలోని నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నూతన రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి నేరుగా తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని గోశాలను సందర్శిస్తారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులతో ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా భేటీ అవుతారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. 

పటిష్ట పోలీసు భద్రత..
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా 3,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. ఇందులో ఐదుగురు ఎస్పీలు, నలుగురు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 35 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 75 మంది ఎస్‌ఐలతోపాటు సిబ్బంది ఉన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా గన్నవరం నుంచి పోరంకికి, అలాగే పోరంకి నుంచి విజయవాడకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అదేవిధంగా రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలు..
► సీఎం వైఎస్‌ జగన్‌ ఉదయం 10.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు.

► అనంతరం 11.25–12.15 గంటల మధ్య పోరంకి మురళి కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

► 12.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరి 1.00–2.15 మధ్య రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఏర్పాటు చేసిన అధికారిక విందులో సీఎం పాల్గొంటారు. 

► అనంతరం 2.35 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికి తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. 

నేడు విశాఖకు రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విశాఖపట్నం రానున్నారు. నేవీ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. సాయంత్రం 4.05 గంటలకు చోళా సూట్‌ నుంచి నేవీ డే ఉత్సవాలకు ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు.

అక్కడ యుద్ధ విన్యాసాల్ని తిలకిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు అనంతగిరిలో నేవీ డే రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరివెళ్తారు. కాగా నేవీ డే ఉత్సవాల్లో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ కూడా పాల్గొంటారు. కాగా గవర్నర్‌ హరిచందన్‌ ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్రపతితో కలిసి నేవీ డే ఉత్సవాలను తిలకిస్తారు. 

రాష్ట్రపతి ప్రారంభించనున్న ప్రాజెక్టులు ఇవే..
► కర్నూలులో డీఆర్‌డీవో నిర్మించిన నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌తో పాటు నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్‌డ్‌ నైట్‌విజన్‌ ప్రొడక్టŠస్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. 

► కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్‌–340లో భాగంగా రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన జాతీయ రహదారి, ఎన్‌హెచ్‌–205లో భాగంగా నిర్మించిన నాలుగు లైన్ల ఆర్‌వోబీని ప్రారంభిస్తారు. అలాగే ఎన్‌హెచ్‌–342లో భాగంగా ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

► ఎన్‌హెచ్‌–44లో భాగంగా కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్‌లో ఆరులైన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ స్ట్రక్చర్, స్లిప్‌ రోడ్స్, డోన్‌ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్లు, రహదారుల్ని కూడా ప్రారంభిస్తారు. 

► రాజమండ్రిలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, సైన్స్‌ సెంటర్‌ని ప్రారంభిస్తారు. 

మరిన్ని వార్తలు