రైతుల చేతికి ముందే కూపన్లు

18 Oct, 2020 03:22 IST|Sakshi

పొలం వద్దే ధాన్యం కొనుగోలు

ఎక్కువ ధర వస్తే బయట అమ్ముకోవచ్చు

ఇతర రాష్ట్రాల ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా నిఘా

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల సంస్థ పక్కా ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ పక్కా ఏర్పాట్లు చేసింది. వరి పండించిన రైతులకు ఈసారి ముందుగానే కూపన్లు పంపిణీ చేస్తారు. కూపన్‌లో అన్ని వివరాలు నమోదు చేసి.. సంబంధిత ఉద్యోగి సంతకం చేయాల్సి ఉంటుంది. కూపన్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏ–గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,868 చొప్పున రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తారు. రబీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.53 చొప్పున ధర పెరిగింది. 

ఈ–క్రాప్‌ ఆధారంగా..
రైతులు దళారులు, వ్యాపారులను ఆశ్రయించి ధర, తూకాల్లో మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు. సాగు వివరాలను ఈ–క్రాప్‌ ద్వారా ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చరల్‌ అసిస్టెంట్ల ద్వారా వెంటనే నమోదు చేయించుకోవాలి. ఈ–క్రాప్‌ నమోదు కోసం వెళ్లే రైతులు ఆధార్‌ కార్డు, సెల్‌ ఫోన్, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ వివరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అవసరమైతే పొలానికి సంబంధించిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకం కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

జియో ట్యాగింగ్‌ తప్పనిసరి
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే వాహనాలకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్‌ ఉండాలి. ధాన్యంలో 17 శాతం తేమ, దెబ్బతిన్నవి లేదా మొలకెత్తిన గింజలు 5 శాతం, కుచించుకుపోయిన గింజలు 3 శాతానికి మించి ఉండకూడదు. తేమ శాతం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని ఎండబెట్టేందుకు అవసరమైన యంత్రాలు, జల్లెడ వంటి వాటిని మార్కెటింగ్‌ శాఖ సమకూరుస్తుంది. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎవరైనా మోసం చేస్తున్నట్టు గుర్తించినా లేదా ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తినా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 లేదా 1800–425–1903కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ఎక్కువ ధర వస్తే బయట అమ్ముకోవచ్చు
రైతులు తమ వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని.. కూపన్‌ పొందినా మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తే బయట మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసేందుకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులకు ముందుగానే కూపన్లు ఇస్తాం. ఆ తర్వాత రైతుల పొలం వద్దకే వెళ్లి ధాన్యం కొంటాం. 
    – కోన శశిధర్, ఎక్స్‌–అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ  

మరిన్ని వార్తలు