ధాన్యం అమ్ముకునేందుకు దిగులొద్దు.. 

5 Nov, 2020 02:53 IST|Sakshi

రైతుల కళ్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తాం 

ప్రతి గింజా కొంటాం.. మద్దతు ధర కల్పిస్తాం 

ఎవరైనా మోసం చేస్తే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు 

ధాన్యం విక్రయించేందుకు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాలి 

పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సూర్యకుమారి   

సాక్షి, అమరావతి: ధాన్యం అమ్ముకునేందుకు రైతులెవరూ దిగాలు చెందకుండా ప్రతి గింజా కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సూర్యకుమారి వెల్లడించారు. రైతులకు రవాణా ఖర్చుల భారం పడకుండా కళ్లాల వద్దే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు, రైతులకు మద్దతు ధర కల్పించే విషయమై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని రైతులు తీసుకొస్తే రవాణా చార్జీలు చెల్లిస్తామన్నారు. ఆమె ఇంకా చెప్పారంటే.. 

► ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 61 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు ప్రస్తుతం 2,620 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అవసరమైతే ఇంకా ఏర్పాటు చేస్తాం. 
► అనంతపురం, కర్నూలు  మినహా మిగిలిన జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ రెండు జిల్లాల్లోనూ ధాన్యం విక్రయించే రైతులు ఉంటే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ధాన్యానికి మద్దతు ధర ‘ఏ’ రకం క్వింటాల్‌కు రూ.1,880, సాధారణ రకానికి రూ.1,868లుగా నిర్ణయించాం. తేమ 17 శాతంలోపు ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం. తేమ 17 నుంచి 23 శాతం వరకు ఉంటే ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెట్టాలని రైతులకు చెప్పి ఆ తర్వాత కొనుగోలు చేస్తాం. 
► మద్దతు ధర ఇవ్వకుండా ఎవరైనా మోసం చేస్తే టోల్‌ఫ్రీ నంబర్లకు 1902, 18004251903 ఫోన్‌ చేయొచ్చు. 
► పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతి రకం ధాన్యాన్ని వేర్వేరుగా సేకరిస్తాం. 

ఆర్‌బీకేలలో రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి... 
రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) ధాన్యం పండించిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆర్‌బీకేలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశాం. ప్రతి ఆర్‌బీకేలో కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ఒకరు అందుబాటులో ఉంటారు. ఆర్‌బీకేల్లోని వ్యవసాయ సహాయకులను రైతులు కలిస్తే మొత్తం వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. రైతు పేరు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, పొలం వివరాలు, ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలి. ఇలా వివరాలు నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారనే విషయాన్ని ముందుగానే రైతులకు తెలియజేస్తారు. ధాన్యం విక్రయించిన పది రోజుల్లోగా రైతు బ్యాంకు ఖాతాకు డబ్బు జమ చేస్తాం. వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం.  

మరిన్ని వార్తలు