ఇంటికే రేషన్‌..

17 Feb, 2021 03:31 IST|Sakshi
చిత్తూరు జిల్లా పూతలపట్టులో రేషన్‌ పంపిణీ చేస్తున్న దృశ్యం

పల్లెలకు పరుగులు తీసిన 8,533 ‘రేషన్‌’ వాహనాలు

గిరిజన ప్రాంతాలు మినహా అన్ని చోట్లా పంపిణీ

సాక్షి, అమరావతి/గుడివాడ రూరల్‌: గిరిజన ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలోని అన్నిచోట్లా పేదలకు ఇంటింటా సరుకులు పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా సరుకుల పంపిణీని ప్రారంభించలేమని ఆయా ప్రాంతాలకు మండలస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనూ గురువారం నుంచి ఇంటింటికీ రేషన్‌ అందించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎక్స్‌–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ వెల్లడించారు.

పల్లెల్లోనూ ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పౌర సరఫరాల విభాగం సోమవారం  రేషన్‌ వాహనాలను పల్లెలకు పంపడం ప్రారంభించింది. రాష్ట్రంలో 9,260 మొబైల్‌ వాహనాలుండగా మంగళవారం వరకు దాదాపు 8,533 వాహనాలు రోడ్డెక్కాయి. ఇప్పటివరకు 27 లక్షల కుటుంబాలకు ఇళ్ల వద్దే సరుకులు అందించారు. రేషన్‌ పంపిణీలో ఈ–పాస్‌ వినియోగంపై వాహనదారులకు డీలర్లు సహకరించాలని కోన శశిధర్‌ కోరారు.

వారంలోగా లబ్ధిదారులందరికీ సరుకులు అందించేలా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతున్నా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా 9,260 మందికి సబ్సిడీపై మొబైల్‌ వాహనాలు పంపిణీ సమకూర్చారని చెప్పారు. మొబైల్‌ వాహనం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, లబ్ధిదారుల ప్రశంసలు పొందేలా సరుకులు పంపిణీ చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు